మంత్రి లక్ష్మణ్ చెప్పినా మారని వాతావరణం
అర్బన్ నక్సల్స్ లేరు
వీసీ వర్సెస్ ప్రొఫెసర్
శాతవాహన వీసీపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిషన్‌కు ఫిర్యాదు
దళిత ప్రొఫెసర్లు, విద్యార్థులను టార్గెట్ చేస్తున్నారని ఆరోపణలు
మంత్రి లక్ష్మణ్ కుమార్ చెప్పినా మారని వాతావరణం
ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ అంటున్నారని విద్యార్థుల ఆవేదన
కరీంనగర్ జిల్లాలో అర్బన్ నక్సల్స్ ఊసే లేదన్న సీపీ ఆలం
రెండు వర్గాలుగా చీలిన వర్సిటీ సిబ్బంది
వర్సిటీ గాథలు–1
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
శాతవాహన యూనివర్సిటీ వివాదాలకు ని లయంగా మారుతోంది. క్రమశిక్షణ పేరిట కొంతకాలంగా వీసీ ఉమేశ్‌కుమార్ తీసుకుంటున్న చర్యల పై విద్యార్థులు నిరసన బాట పట్టగా.. తాజాగా ద ళితులను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారంటూ ఏ కంగా ప్రొఫెసర్లు బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. దళిత మహిళనైన తనను అసంబద్ధ చర్యలతో వేధిస్తున్నారంటూ తెలంగాణ విద్యా కమిషన్ సలహా కమిటీ సభ్యురాలు, సోషియాలజీ విభాగాధిపతి సూరేపల్లి సుజాత రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అకారణంగా తనను, మరికొందరు దళిత విద్యార్థులను అర్బన్ నక్సలైట్లు అంటూ ప్రచారం చేయ డం తన మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓవైపు తెలంగాణలో మావోయిస్టులు లేరంటూ డీజీపీ ప్రకటిస్తుంటే.. తమను అర్బన్ నక్సలైట్లంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని, వారిని ప్రోత్సహిస్తున్న వీ సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
గతంలో వర్సిటీ వివిధ ఆరోపణలపై తొలగించిన ఇద్దరు అధ్యాపకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవడం ఈ వివాదానికి ఆజ్యం పోసింది. వర్సిటీకి 12–బీ హోదా ఇవ్వకూడదంటూ యూజీసీకి అధ్యాపకులు కొందరు లేఖ రాశారు. విచారణ జరిపిన వర్సిటీ ఐ దుగురు అధ్యాపకులను బాధ్యులుగా గుర్తించి వి ధుల నుంచి తప్పించింది. ఆ ఐదుగురిలో ఇద్దరిని ఇటీవల వీసీ విధుల్లోకి తీసుకున్నారు. ఇక్కడే సి బ్బంది రెండు వర్గాలుగా చీలిపోయారు. వీరి ని యామకాన్ని కొందరు విద్యార్థులు, సిబ్బంది వ్యతి రేకిస్తున్నారు. మరోవైపు వర్సిటీలో కొందరు అర్బన్ నక్సలైట్లు చేరారంటూ ఆరోపిస్తూ.. మరోవర్గం కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. ఇందులో ప్రొఫెసర్ సుజా త పేరు ఉండటంతో ఆమె ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకు ని ఉమేశ్‌కుమార్ కొంతకాలంగా ప్రతీకార చర్యల కు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. 12–బీ వ్య వహారంలో బహిష్కరణకు గురైన అధ్యాపకుడు పెంచాల శ్రీనివాస్‌తో కలిసి ఆయన తనపై దుష్ప్రచారానికి తెరతీశారని మండిపడుతున్నారు. కనీసం నోటిఫికేషన్ లేకుండా వారిద్దరిని ఎలా నియమిస్తారంటూ విద్యార్థులు ధర్నా చేయడంతో వారంపా టు వారికి క్లాసులు ఇవ్వమంటూ వీసీ హామీ ఇవ్వడంతో శాంతించారు. వసతులు, హక్కుల కోసం ప్రశ్నిస్తే.. తమను అర్బన్ నక్సల్స్ అని ముద్ర వేసి బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఫ్రొఫెసర్ సుజాత ను పదవుల నుంచి తప్పించడంపై వీసీ స్పంది స్తూ .. ఆమెను ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా తొలగించినందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని వివరించారు.
గతేడాది వర్సిటీలో ఎస్సీ సంక్షేమ నిధులతో చేపట్టిన భవన నిర్మాణ పనుల ప్రారంభ సమయంలో మంత్రి లక్ష్మణ్‌కు ప్రాధాన్యం తగ్గించిన విషయం అప్పట్లో వివాదాస్పదమైంది. ఇది ఇద్దరు రాష్ట్ర మంత్రుల మధ్య మాటల చిచ్చు పెట్టింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆ సమయంలో వీసీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. తన శాఖ నిధులతో జరిగే పనులలో తనకు ప్రాధాన్యం తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ విషయంలో పొరపాట్లు పునరావృతం కాకూడదని మందలించారు. తాజాగా తనను వరుసగా పదవుల నుంచి తప్పించడంపైనా ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో దళితులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని మంత్రి లక్ష్మణ్ ఫోన్‌లో వీసీకి హితవు పలికారు. సాక్షాత్తూ ఎస్సీ సంక్షేమ మంత్రి చెప్పినా వీసీ తనను వేధించడం ఆపడం లేదంటూ, అందుకే, అతనిపై అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించానని సుజాత ‘సాక్షి’కి వెల్లడించారు.
కరీంనగర్‌లో అర్బన్ నక్సల్స్ ఉన్నారంటూ మాకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై మా నిఘా విభాగాలు ఎలాంటి ఇన్‌పుట్స్ ఇవ్వలేదు. దీనిపై విద్యార్థులు ఎలాటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కమిషనరేట్ పరిధిలో అర్బన్ నక్సలైట్లు ఎవరూ లేరు.
– గౌస్ ఆలం, పోలీస్ కమిషనర్


