జ్యోతినగర్: రామగుండంలోని ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్‌ఆర్)బిజయ్‌కుమార్ సిగ్దర్ సేవలు ప్రశంసనీయమని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సామంత అన్నారు. మంగళవారం పరిపాలనా భవనంలో జరిగిన ఎన్టీపీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉద్యోగ విరమ ణ పొందుతున్న ఏజీఎం బిజ్‌కుమార్ సిగ్దర్, రమణారెడ్డి, భీమ్‌రావు, రాజమహెందర్‌రెడ్డి, దామోదర్‌రావును సన్మానించారు. ఈడీ మాట్లాడుతూ, 2007 లో ఎన్టీపీసీలో ఉద్యోగంలో చేరిన సిగ్దర్ అంకితభావంతో పనిచేశారన్నారు. హెచ్‌ఆర్ పద్ధతులను బలోపేతం చేయడం, సానుకూల పని సంస్కృతిని పెంపొందించడం, బలమైన ఉద్యోగి సంబంధాలను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించారని స్పష్టం చేశారు. అనంతరం ఏజీఎం సిగ్దర్‌ను రామగుండం మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేటర్లు శాలువాలతో సన్మానించారు.
చెత్తవేస్తే మార్కెట్ నుంచి ఖాళీ చేయిస్తాం
కోల్‌సిటీ: కాలువల్లో పళ్లు, కూరగాయలు, మాంసం వ్యర్థాలు, చెత్త పడవేస్తే రూ.500 జరిమానా విధించడంతోపాటు పునరవృతమైతే మార్కెట్ నుంచి ఖాళీ చేయిస్తామని మేయర్ మహంకాళి స్వామి వ్యాపారులను హెచ్చరించారు. సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసి జరిమానా విధిస్తామన్నారు. గోదావరిఖని శివాజీనగర్‌లోని మార్కెట్ వ్యాపారులతో మంగళవారం బల్దియా కార్యాలయంలో మేయర్ సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ, ప్రతీవ్యాపారి గురువారంలోగా రెండు బకెట్లు(పచ్చ, నీలిరంగు) సమకూర్చుకుని అందులోనే వ్యర్థాలు వేయాలన్నారు. మార్కెట్ అభివృద్ధి, పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. తడిచెత్తను రీసైక్లింగ్ చేసే బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని వెల్లడించారు. సుమారు రూ.3కోట్ల వ్యయంతో నిర్మించిన షెడ్ ఏప్రిల్ చివరివారం వరకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. రోడ్లు, యూజీడీ, రైతులకు రెస్ట్ రూమ్స్, ఆర్వోప్లాంట్, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పిస్తామని వివరించారు. అద్దె బకాయిలు సక్రమంగా చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పీవీ రామన్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ సంపత్ పాల్గొన్నారు.


