రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్‌స్టేషన్ వెనకాల గల పాతబజార్‌లో సోమవారం రాత్రి జరిగిన చైన్‌స్నాచింగ్ ఘటన పాతబజార్‌తో పాటు పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. పట్టణంలో ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదు. దీనిని సీరియస్‌గా పరిగణిస్తూ పోలీసులు ఇప్పటికే గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
వాకింగ్ చేస్తుండగా..
స్వశక్తి సంఘాల ముఖ్య ప్రతినిధి కోల కుసుమకుమారి.. సోమవారం సాయంత్రం వేళ అల్పాహారం చేసింది. ఆ తర్వాత తన ఇంటి ఎదుట కాసేపు వాకింగ్ చేసింది. ఆ వీధిలోని పల్లెర్ల శ్రీనివాస్ ఇంటి ఎదుట పొరుగు మహిళలతో ముచ్చటిస్తోంది. ఈ క్రమంలో ఓ గుర్తు తెలియని యువకుడు అక్కా అని పిలుస్తూ కుసుమ వద్దకు వస్తూనే మెడలోని నాలుగున్నర తులాల పుస్తెలతాడును కట్టర్‌తోకట్ చేసి పట్టుకొని పరుగులుపెట్టాడు. అప్పటికే ప్రధాన రోడ్డుపై పల్సర్ బైక్‌తో సిద్ధంగా ఉన్న మరోవ్యక్తితో కలిసి క్షణాల్లో మాయమయ్యాడు. సినీఫక్కీగా జరిగిన ఘటనతో అర్ధగంట వరకు బాధితురాలు తేరుకోలేకపోయింది. గ్రూపు లీడర్ కావడంతో అక్కా అని పిలుస్తూ వచ్చిన వ్యక్తిని గుర్తించలేకపోయామని స్థానికులు తెలిపారు.
కాలనీలో అంధకారం
కాలనీలో వీధిదీపాలు వెలుగడంలేదు. చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. సీసీ కెమెరాలు లేవు. దీంతోనే నిందితుడు చాకచాక్యంగా తనపని ముగించుకొని వెళ్లిపోయాడు. ఘటనకు ముందు సదరు వ్యక్తి ఒకసారి పాతబజార్‌కాలనీ చివరి వరకు రెక్కీచేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
చైన్‌స్నాచింగ్‌పై డీసీపీ విచారణ
స్థానిక పాతబజార్‌లో సోమవారం రాత్రి జరిగిన చైన్‌స్నాచింగ్‌పై పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. బాధితురాలు కోల కుసుమకుమారితో మాట్లాడి వివరాలు సేకరించారు. విచారణలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, రామగుండం ఎస్సై సంధ్యారాణి తదితరులు ఉన్నారు. కాగా, పోలీస్‌స్టేషన్ వెనకాలే చైన్‌స్నాచింగ్ ఘటన జరగడాన్ని పోలీసు యంత్రాంగం సీరియస్‌గా పరిగణిస్తోంది.
విచారణ చేపట్టాం
పాతబజార్‌కాలనీలో ఇప్పటివరకు చైన్‌స్నాచింగ్‌లు చోటుచేసుకోలేదు. ఈ ఘటనపై విచారణ చేపట్టాం. పలుప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నాం. నిందితులను త్వరలోనే పట్టుకుంటాం. ఆరుబయటకు వెళ్లే మహిళలు చాలాజాగ్రత్తలు పాటించాలి.
– రమేశ్, ఏసీపీ, గోదావరిఖని
పాతబజార్‌కాలనీలో కలకలం
నిందితుల వేటలో పోలీస్‌యంత్రాంగం


