బడిలో పసుపు, కుంకుమ కలకలం
ఆకతాయిల పనే కావచ్చు
మంథనిరూరల్: శా స్త్ర, సాంకేతిక పరిజ్ఞానం సైబర్‌వేగంతో వృద్ధి చెందుతోంది. ప్రపంచాన్ని అరచేతిలో నే చూస్తున్నాం. అ యినా, పల్లెవాసులను మూఢనమ్మకాలు ఇంకా పట్టిపీడిస్తున్నాయి. నిన్నామొన్నటి వరకు ప్రజలకే పరిమితమైన ఈ జాఢ్యం.. తాజాగా చదువుల ఒడి ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలోకి చేరడం కలకలం రేపుతోంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఆరెంద పంచాయతీ పరిధి ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సోమవారం గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో వేసిన ముగ్గులతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీటిని ఆదిలోనే అరికట్టకపోతే విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం చూపే ప్రమాదం ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ఏకోపాధ్యాయ పాఠశాల..
ఇందిరానగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకేఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. ఏడుగురు విద్యార్ధులు చదువుకుంటున్నారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం ఉదయం ఆయా వచ్చి తరగతి గదులు శుభ్రం చేసే క్రమంలో ముగ్గు కనిపించింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లింది. గుర్తుతెలియనివారు పాఠశాల ఆవరణలో ముగ్గు వేసి అందులో పసుపు, కుంకుమ పోసి నిమ్మకాయలు పెట్టినట్లు ఉపాధ్యాయుడు ఉమాపతి తెలిపారు.
ఉమాపతి సార్ బడికి రావద్దు
ఉమాపతి సార్ బడికి రావద్దంటూ ముగ్గులో రాసి ఉంది. దీనిని చూసిన ఉపాధ్యాయుడు భయాందోళనలు వ్యక్తం చేశారు. విద్యార్ధులకు మంచిగానే చదువు చెబుతూ, క్రమశిక్షణ నేర్పిస్తున్నానని, ఎవరికీ అపకారం చేయలేదని, తన పేరు ఎందుకు రాశారో అర్థం కావడం లేదని ఉమాపతి ఆవేదన వ్యక్తం చేశారు.
పాఠశాల ఆవరణలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలతో ముగ్గు వేయడం ఆకతాయిల పనే అయి ఉంటుంది. ఉపాధ్యాయుడు అందరితో కలివిడిగానే ఉంటున్నారు. విద్యార్ధులకు మంచి బోధన చేస్తున్నారు. ఘటనపై విచారణ జరిపిస్తాం.
– దాసరి లక్ష్మి,
మండల విద్యాధికారి, మంథని
ముగ్గువేసిన దుండగులు
మధ్యలో నిమ్మకాయలు ఉంచిన వైనం
ఉమాపతి సార్ బడికి రావద్దంటూ రాతలు
ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో కలకలం
భయాందోళనలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు
బడిలో పసుపు, కుంకుమ కలకలం


