ఆశల ఆప్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ఆశల ఆప్షన్‌

Feb 20 2026 6:56 AM | Updated on Feb 20 2026 6:56 AM

ఆశల ఆప్షన్‌

ఆశల ఆప్షన్‌

సాక్షి పెద్దపల్లి:

ల్దియాల్లో నూతన పాలకవర్గాల ఏర్పాటు పూర్తికావడంతో ఇప్పుడు అందరి చూపు కోఆప్షన్‌ సభ్యుల భర్తీపై పడింది. పట్టణ అభివృద్ధికి సలహాలు, సూచనలు అందిస్తూ, సమావేశాల్లో పాల్గొని సమస్యలపై చర్చించే అవకాశం ఉన్న కో ఆప్షన్‌ పదవులపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. టికెట్‌ ఆశించి భంగపడిన వారితో పాటు కొత్తగా నామినేటెడ్‌ పదవులను ఆశించే వారు కో ఆప్షన్‌ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తమకు అవకాశం కల్పించాలంటూ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ఇలా..

కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక కోసం మార్గదర్శకాలతో ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. కార్పొరేషన్‌లో మొత్తం ఐదుగురు కో ఆప్షన్‌ సభ్యులకుగానూ ఇద్దరు మైనార్టీలు, మరో ముగ్గురు పరిపాలనపై అవగాహన కలిగిన మాజీ ప్రజా ప్రతినిధులు, విశ్రాంత అధికారులు, ఉద్యోగులై ఉండాలి. అంటే ఇక్కడ మాజీ కార్పొరేటర్లకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మున్సిపాల్టీల్లో నలుగురు సభ్యులకు గానూ ఇద్దరు మైనార్టీ వర్గానికి చెందినవారు, మరో ఇద్దరు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషనపై అవగాహన కలిగినవారు ఉండాలి. అందులో ఇద్దరు మహిళలకు తప్పకుండా అవకాశం కల్పించాల్సి ఉంటుంది. కో ఆప్షన్‌ సభ్యుల స్థానాలకు దరఖాస్తు చేసుకునేవారు ఆయా కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో ఓట రై ఉండి 21 ఏళ్లు నిండాలి. దరఖాస్తు చేసిన వారిలో సభ్యుల ఎన్నిక కోసం మేయర్‌, చైర్మన్‌ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించి.. కార్పొరేషన్‌లో కార్పొరేటర్లు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు చేతులెత్తి కో ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకుంటారు. పాలకవర్గం ఏర్పాటైన తొలి సమావేశం నుంచి 60 రోజుల్లోపు కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక జరగాల్సి ఉంటుంది.

దక్కేదెవరికో..?

ఎన్నికల సమయంలో టికెట్లను ఆశించి భంగపడ్డవారిలో కో ఆప్షన్‌ పదవుల కోసం తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. కో ఆప్షన్‌ పదవి ఇవ్వలేని పక్షంలో ఏదైనా నామినేటెడ్‌ పదవులు ఇప్పించాలంటూ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పార్టీ టికెట్లపై పోటీచేసీ ఓడిపోయిన వారు కొందరు కో ఆప్షన్‌ పదవుల కోసం పోటీపడుతుండగా, సామాజిక సమీకరణాల నేపథ్యంలో అవకాశం దక్కని వారు మళ్లీ ప్రయత్నాలను ప్రారంభించారు. ముఖ్య నేతలను కలుస్తూ తమకు అవకాశం ఇప్పించాలని కోరుతున్నారు. దీంతో అధికార పార్టీలో రాజకీయ సందడి నెలకొంది.

నామినేటెడ్‌పై గంపెడాశలు

పదేళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడంతో తమకు ఏదో ఒక పదవి దక్కుతుందని చాలా మంది ఆశపడ్డారు. కొందరు రాష్ట్ర స్థాయిలో పదవులు కోరుతుండగా, మరికొందరు జిల్లాస్థాయిలో పదవులను ఆశిస్తున్నారు. మార్కెట్‌ కమిటీ, ఆలయ చైర్మన్లు, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల నుంచి రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు కోరుతున్నారు. ఇప్పటికే పలు నామినేట్‌డ్‌ పోస్టులు భర్తీ చేయగా, జిల్లాలో పలువురిని వరించాయి. కాగా, ఎన్నికల్లో అభ్యర్థుల విజయం కోసం కష్టపడ్డామని, ఎన్నికల్లో తమతో పనిచేయించుకుంటూ పదవులు మాత్రం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదవులు తమకెప్పుడు అంటూ వాపోతున్నారు. ప్రస్తుతం కేంద్ర నాయకత్వం నామినేట్‌డ్‌ పోస్టుల భర్తీ చేయడానికి సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో ఈసారైనా అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

కో ఆప్షన్‌ పదవులపై పలువురి కన్ను

టికెట్లు దక్కనివారి చూపు వాటిపైనే

నామినేటెడ్‌ పదవులపై మరికొందరి దృష్టి

ప్రయత్నాలు ప్రారంభించిన ఆశావహులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement