మద్దతు కోసం ఆందోళన
పెద్దపల్లిరూరల్: పత్తి పంట దిగుబడులకు నిన్నటి దాకా మద్దతు ధర లభించగా.. గురువారం అకస్మాత్తుగా రూ.వెయ్యికి పైగా ధర తగ్గడం.. శనివారం నుంచి సీసీఐ కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో ఆందోళన పడ్డ రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు రైతులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కార్యాలయంలో అధికారులతో చర్చించారు. క్వింటాల్‌కు రూ.7 వేలకు పైగా మద్దతు ధర పలకగా గురువారం రూ.5వేలకే పడిపోవడమేంటని రైతులు నిలదీశారు.
కొనుగోలు చేసింది ఒక్క ట్రేడరే..
పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో పత్తి దిగుబడులను కొనేందుకు ఒక్క వ్యాపారి మాత్రమే అందుబాటులో ఉండడం.. నిన్నటి వరకు పలికిన మద్దతు ధర కన్న రూ.వెయ్యికి పైగా ధర తగ్గడంతో రైతులు ఖంగు తిన్నారు. రోజూ క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7వేలకు పైగా ధర పలకగా గురువారం రూ.ఐదారువేలకే పడిపోవడానికి గల కారణమేంటని రైతులు ప్రశ్నించారు. రాజీవ్ రహదారిపై నిరసన తెలిపేందుకు యత్నించారు. విషయం తెలుసుకున్న అధికారులు, రైతులను సముదాయించారు. పోలీసులు చేరుకుని రైతులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటారని, ధర గిట్టుబాటు అయితేనే అమ్ముకోవాలని సూచించారు. నిర్ణయించిన ధరలకు కొంత అదనంగా కలిపి చెల్లించేందుకు వ్యాపారి అంగీకరించడంతో కొందరు తమ దిగుబడులను అమ్ముకున్నారు.
పడిపోయిన పత్తి ధరలు
నిరసనకు దిగిన అన్నదాతలు
రోడ్డెక్కేందుకు యత్నం
సముదాయించి..సమస్యకు పరిష్కారం చూపిన అధికారులు
మద్దతు కోసం ఆందోళన


