ఫార్మర్ రిజిస్ట్రీకి ఓటీపీ భయం
మంథనిరూరల్: కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించే సంక్షేమ పథకాల అమలు కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీకి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. గతేడాది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు వివరాల నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అయితే ఫార్మర్ రిజిస్ట్రీలో మూడు ఓటీపీలు నమోదు చేయాల్సి ఉండగా.. సై బర్‌నేరాలు చోటుచేసుకుంటున్న క్రమంలో అన్నదాతలు ఓటీపీలు చెప్పేందుకు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ప్రక్రియ జిల్లాలో నెమ్మదించింది.
58 శాతమే నమోదు
జిల్లాలోని 13 మండలాల్లో గతేడాది ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లావ్యాప్తంగా 1,60,673 మంది రైతులు ఉన్నారు. ఇందులో ఇప్పటివరకు కేవలం 87,150 మంది మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు చేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కల ప్రకారం ఇప్పటివరకు కేవలం 58 శాతం మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు అయినట్లు తెలుస్తోంది.
మూడు ఓటీపీలు చెప్పాల్సి రావడంతో..
ఫార్మర్ రిజిస్ట్రీ కోసం రైతుల నుంచి వ్యవసాయ విస్తరణ అధికారులు వివరాలు నమోదు చేస్తుంటా రు. ఇందుకోసం పట్టాదారు పాసుపుస్తకం వివరా లు, ఆధార్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రైతు మొబైల్‌కు మూడుసార్లు ఓటీపీ నంబర్ వస్తుంది. ఈ మూడు ఓటీపీలను ఏఈవోలకు సదరు రైతు చెప్పాలి. ఆ నంబర్‌లను నమోదు చేస్తేనే ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తవుతుంది.
సైబర్ నేరాల నేపథ్యంలో..
ప్రస్తుతం సైబర్‌నేరాల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. వాటి నియంత్రణకు పోలీస్‌లు, అధికారు లు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఎవరు ఓటీపీలు అడిగినా చెప్పకూడదని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఫార్మర్ రిజిస్ట్రీ కోసం ఏఈవోలు రైతులకు ఫోన్‌చేసి ఓటీపీలు చెప్పాలని అడిగితే.. భయపడి వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీపై అవగాహన లేకపోవడం, మరికొంత మంది ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండడం, పలువురు అన్నదాతలకు మొబైల్ ఫోన్‌లు లేకపోవడంలాంటి కారణాలతో ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫార్మర్ రిజిస్ట్రీతో ఐడీ నంబర్
కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు పారదర్శకంగా అమలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ నమోదుతో భూమి ఉన్నప్రతీ రైతుకు 14అంకెల యూనిక్ ఐడీ నంబర్ కేటాయించనుంది. 14 అంకెల యూనిక్ ఐడీ పొందిన ప్రతీరైతుకు కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వం అందించే పథకాలను అందజేస్తారు. ముఖ్యంగా రాయితీ రుణాల మంజూరుకు ఈ నంబర్‌ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.
ప్రతీరైతుకు తప్పనిసరి
భూమి ఉన్న ప్రతీరైతు తప్పకుండా ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలి. ప్రభుత్వం కేటాయించే 14 అంకెల యూనిక్ నంబర్ ఆధారంగానే అన్నదాతలకు పథకాలు వర్తిస్తాయి. కొన్ని కారణాలతో జిల్లాలో నమోదు ప్రక్రియలో ఆలస్యం అవుతోంది. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో రైతులకు అవగాహన కల్పించి వివరాల నమోదు ప్రక్రియలో వేగం పెంచుతున్నాం. జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీని వంద శాతం పూర్తిచేసేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి
వివరాల నమోదుపై రైతుల అనాసక్తి
జిల్లాలో నెమ్మదించిన నమోదు ప్రక్రియ
ప్రతీరైతుకు ఆధార్ తరహాలో ఐడీ నంబర్
ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకుంటేనే అన్నదాతలకు ప్రయోజనాలు
వందశాతం పూర్తిచేసేందుకు అధికారుల కసరత్తు
ఫార్మర్ రిజిస్ట్రీకి ఓటీపీ భయం
ఫార్మర్ రిజిస్ట్రీకి ఓటీపీ భయం


