పల్లె మారుతోంది!
బోయినపల్లి(చొప్పదండి): పల్లె తీరు మారుతోంది. ప్రజల జీవన విధానంలో మార్పు వస్తోంది. సిరిసిల్ల– కరీంనగర్ రోడ్డుపైనే ఉన్నా ఒకప్పటి పల్లె నేడు పట్టణ పోకడలను సంతరించుకుంటోంది. రోజురోజుకు వ్యాపారసంస్థలు వెలుస్తుండడం.. అందమైన భవనాలు.. విద్యాసంస్థలతో రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని వెంకట్రావుపల్లి రూపు మారింది. పట్టణంలా మారుతున్న ఆ ఊరిపై సండే స్పెషల్ కథనం.
గ్రామీణ విద్యార్థులకు కార్పొరేట్ విద్య
కరీంనగర్–సిరిసిల్ల మార్గంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనే ఆలోచనతో 2004లో బీఈడీ కళాశాలను ఏర్పాటు చేశాం. బీఈడీతోపాటు డీఈడీ, ఎంబీఏ విద్య అందుబాటులోకి తెచ్చాం. ఇక్కడ వసతులు బాగున్నాయి. ఊరు కూడా అభివృద్ధి చెందుతుంది.
– పేర్యాల దేవేందర్‌రావు, రూసో కళాశాల చైర్మన్, వెంకట్రావుపల్లి
ఆధ్యాత్మితక ఉట్టి పడేలా..
వెంకట్రావుపల్లి చౌరస్తా నుంచి ఇల్లంతకుంట బోయినపల్లి, గన్నేరువరం, బెజ్జంకి మండలాలతోపాటు సిద్దిపేట జిల్లా వరకు రాకపోకలు సాగుతుంటాయి. 1,333 మంది జనాభా మాత్రమే ఉన్న చిన్న గ్రామం. గ్రామంలో 1,042 మంది ఓటర్లు ఉంటారు. గతంలో ప్రధాన రోడ్డుకు ఆనుకొని పెద్దగా నివాసాలు లేవు. ప్రస్తుతం రోడ్డుకు ఆనుకొని గృహాలు వెలుస్తున్నాయి. డబుల్‌రోడ్డు కావడంతో పదేళ్లుగా చాలా మంది రోడ్‌సైడ్‌లో అందమైన భవనాలు నిర్మించుకున్నారు. సిటీకల్చర్‌కు అనుగుణంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. రోడ్డు పరిసరాల్లో 20 ఏళ్ల క్రితం ఎకరాకు రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ధర పలకగా, ఇప్పుడు రూ.కోటి పైనే పలుకుతోంది.
విద్యాసంస్థల నిలయం
సిరిసిల్ల–కరీంనగర్ ప్రధాన రహదారికి ఆనుకొని ఉండడంతో అనేక విద్యాసంస్థలు వెలుస్తున్నాయి. 2004లో ఆరు ఎకరాల్లో రూసో బీఈడీ కళాశాలను ఏర్పాటు చేశారు. అనంతరం అందులోనే డీఈడీ, ఎంబీఏ కళాశాలలు నిర్వహిస్తున్నారు.
చౌరస్తాలో వ్యాపారాలు
ఫోర్‌లేన్ రోడ్డులోని వెంకట్రావుపల్లి చౌరస్తా వ్యాపారాలకు అనుకూలంగా మారింది. ఇక్కడి జంక్షన్ నుంచి ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం, సిద్దిపేటకు రాకపోకలు సాగుతుంటాయి. ఈ చౌరస్తా వ్యాపారాలకు అడ్డాగా మారింది. గ్రామ శివారుల్లో గ్రానైట్ ఫ్యాక్టరీలు అనేకం ఉన్నాయి. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బిర్యానీ సెంటర్లు కోకొల్లలు. కరీంనగర్ పట్టణం 18 కిలోమీటర్లు మాత్రమే ఉండడంతో పల్లె క్రమంగా మారుతోంది.
పల్లె మారుతోంది!


