
బీజేపీలో రచ్చకెక్కుతున్న విభేదాలు!
ఈటలపై హుజూరాబాద్ బీజేపీ శ్రేణుల ఫిర్యాదు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ రాష్ట్ర అధ్యక్షుడికి ఏకరువు ఇతర పార్టీల నుంచి అనుచరులకు టిక్కెట్లు ఇప్పిస్తాననడంపై మండిపడుతున్న నాయకులు
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
భారతీయ జనతా పార్టీలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై స్థానిక పార్టీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదులు అందజేశారు. గతంలో షామీర్‌పేట్‌లో హుజూరాబాద్ కేడర్‌తో సమావేశం ఏర్పాటు చేసి పార్టీపై పార్టీలో ముఖ్య నాయకులపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఇటీవల హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో లోకల్ బీజేపీ లీడర్లతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ టికెట్ రాకుంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి టికెట్ ఇప్పిస్తానని హామీ ఇవ్వండం కలకలం రేపింది. బీజేపీలో ఉంటూ శ్రీమరో పార్టీ టికెట్ ఇప్పిస్తానన్ఙి ఈటల ఎలా హామీ ఇస్తారంటూ ఈటలపై మండిపడుతున్నారు. కొత్త నేతలు, పాత నాయకులంటూ ఈటల రెండు వర్గాలుగా పార్టీ శ్రేణులను విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. పార్టీ నిబంధనలు విస్మరించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, తన అనుచరులకు ఇతర పార్టీల నుంచైనా టికెట్లు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నాడని సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది బీజేపీనా? లేక ఈటల వ్యక్తిగత దుకాణమా? అని కొంతమంది నాయకులు చర్చించుకుంటున్నారు. ఈటల చర్యలపై అసంతృప్తిగా ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటు మరికొంతమంది నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావును కరీంనగర్‌లో కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో బీజేపీని బలహీనపరుస్తూ వ్యక్తిగత అనుచరులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఈటల వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారని తెలిసింది. అంతర్గత విభేదాలు ఇలానేన కొనసాగితే రానున్న ఎన్నికలలో ఈటల విధానం పార్టీకి ముప్పు తెస్తుందని బీజేపీ సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గతంగా ఈటలను కట్టడి చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది. ఓ వైపు స్థానిక సంస్థల్లో బలం పెంచుకొని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ, మరోవైపు ఈటల మార్క్ రాజకీయాల వలన ఇబ్బందుల్లో పడుతుందని పేర్కొంటున్నారు. పార్టీలో అంతర్గత విభేదాలతో రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూల ఫలితాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇక ఈటలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటుందో అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.