
అందరికీ ప్లాన్–బి!
ఓసీ అభ్యర్థుల ఆశలు
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
బీసీ రిజర్వేషన్ల అంశం విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. 42 శాతం రిజర్వేషన్లు యథావిధిగా అమలవుతాయా? లేదా కోర్టు తీర్పు ఆధారంగా మారుతాయా? అన్న మీమాంస ప్రతీ రాజకీయ పార్టీని, పోటీ చేసే ఆశావహులను వేధిస్తోంది. అదే సమయంలో అందుకు తగ్గట్లుగా ఇటు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయాలు, అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ తదితర పార్టీలు, ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు సిద్ధంగా వారివారి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా అందుకు అనుగుణంగా ముందుకు వెళ్లేందుకు ఎవరి వ్యూహాలు వారు రచిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు, రాజకీయ పార్టీలు, ఆశావహులు ఎవరికి వారు ప్లాన్–బీని సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రత్యామ్నాయ ప్రణాళికలు
స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పటికిప్పుడు అమలయ్యేది కాదు. దీనికి సవాలక్ష సాంకేతిక, రాజ్యాంగపరమైన చిక్కులు ఎదురవనున్నాయి. ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అంతా 42 శాతంతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు. అదే సమయంలో కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే.. అప్పటికప్పుడు ఇబ్బందులు పడకుండా 23శాతంతోనూ రిజర్వేషన్లతో మరో జాబితా ముందుస్తుగా తమ వద్ద ఉంచుకున్నారు. అదే సమయంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వస్తున్న ప్రతిపాదనలను ఆయా పార్టీలు పక్కనబెడుతున్నాయి. వాస్తవానికి ప్రతీ పార్టీ ఇప్పటికే స్థానిక సంస్థల్లో 23 శాతం బీసీ రిజర్వేషన్ల ఆధారంగా తమ పార్టీ బలాబలాలపై సర్వేలు చేయించుకున్నాయి. అందుకే, కోర్టు తీర్పు ఆధారంగానే ప్లాన్–ఎ లేదా ప్లాన్–బిని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అదే సమయంలో ఆశావహులు కూడా అదే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కోర్టు తీర్పు వచ్చేవరకు తొందరపడకుండా.. ఖర్చు విషయంలో ఆచీతూచి వ్యవహరిస్తున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నా.. కొన్నేళ్లుగా పోటీ చేద్దామని పార్టీకి పనిచేస్తున్న అన్ని పార్టీల నాయకులంతా ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అదే సమయంలో విషయం కోర్టుకు వెళ్లడంతో 23 శాతంతోనే ఎన్నికలు జరుగుతాయని, తాము బరిలోనే ఉంటామని న్యాయస్థానంపై గంపెడాశలతో ఉన్నారు. అదే గనుక వాస్తవరూపం దాల్చితే.. ఏకంగా 19 శాతం మేరకు బీసీ స్థానాలపై ప్రభావం చూపించనుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో మార్పులు వాస్తవరూపం దాలిస్తే.. ఎస్సీ 15 శాతం, ఎస్టీ ఏడు శాతం రిజర్వేషన్లపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇక ఓసీ జనరల్, ఓసీ మహిళలకు 19 శాతం మేరకు అవకాశాలు పెరగనున్నాయి. జనరల్ కాబట్టి, ఈ వేదికలపై ఎవరైనా పోటీ పడేందుకు విస్తృత అవకాశాలు వస్తాయి. ఏది ఏమైనా కోర్టు తీర్పు కోసం ఇటు కలెక్టర్ కార్యాలయాలు, అటు రాజకీయ పార్టీలు, ఆశావహులు అంతా ప్లాన్–బీతో బరిలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నారు.