
రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
అందరూ ఎనిమిది గంటలు పనిచేయాలి సింగరేణి ఉద్యోగులకు దసరా శుభాంకాక్షలు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం
గోదావరిఖని: దసరా పండుగ ఉద్యోగ కుటుంబాల్లో సుఖసంతోషాలు పంచాలని, ఇదేస్ఫూర్తితో నిర్దేశిత 8గంటల పాటు విధినిర్వహణలో పాలుపంచుకోవాలని సింగరేణి సీఎండీ బలరాం ఆకాంక్షించారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనపై కొత్తగూడెం ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ఏరియాల అధికారులకు బుధవారం ఆయన దిశానిర్దేశం చేశారు. ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనకు రోజూ 2.25 లక్షల టన్నులు ఉత్పత్తి సాధించడంతోపాటు రవాణా చేయాలని ఆదేశించారు. రోజూ 14 లక్షల క్యూ బిక్ మీటర్ల ఓబీ తొలగించాలన్నారు. మూడు నెల లుగా కురుస్తున్న భారీవర్షాలతో ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరునెలల్లో 91 శాతం ఉత్పత్తి, 93 శాతం రవాణా లక్ష్యం సాధించామని, మిగిలిన ఆరు నెలల్లో లక్ష్య సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. సింగరేణి మనుగడ, ఉజ్వల భవిష్యత్‌కు దోహదపడే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని, ఇందులో భాగంగా కీలక ఖనిజాల అన్వేషణ రంగంలోనూ అడుగు పెట్టామని, బొగ్గు బ్లాకులు, ఇతర ఖనిజాల వేలంలోనూ పాల్గొనేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందన్నారు. సింగరేణి అంతర్జాతీయ కార్యాలయం నిర్మాణం కోసం ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయించడంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డైరెక్టర్లు ఎల్‌వీ సూర్యనారాయణ, కె.వెంకటేశ్వర్లు, గౌతమ్ పొట్రు, తిరుమలరావు, కోల్ మూమెంట్ ఈడీ బి.వెంకన్న, కో ఆర్డినేషన్ జీఎం టి.శ్రీనివాస్‌తోపాటు అన్ని ఏరియాల జీఎంలు పాల్గొన్నారు.