నైపుణ్య శిక్షణ.. ఉపాధి కల్పన | - | Sakshi
Sakshi News home page

నైపుణ్య శిక్షణ.. ఉపాధి కల్పన

Sep 27 2025 6:47 AM | Updated on Sep 27 2025 6:47 AM

నైపుణ్య శిక్షణ.. ఉపాధి కల్పన

నైపుణ్య శిక్షణ.. ఉపాధి కల్పన

యువత కోసమే అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు నేడు ఏటీసీలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రామగుండంలో ప్రారంభానికి సిద్ధమైన ఏటీసీ

రామగుండం: మూసపద్ధతిలో విద్యాబోధనకు స్వస్తి పలుకుతున్నారు.. పరిశ్రమల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సొంతం చేసుకుంటున్నారు. ఆ దిశగా విద్యాబోధనలో సమూల మార్పులు చేస్తున్నారు. ఈమేరకు ఇండస్ట్రియల్‌ ట్రెయినింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (ఐటీఐ)లకు అనుబంధంగా అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌(ఏటీసీ)లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రెయినింగ్‌ (డీజీటీ) సహకారం తీసుకుంటున్నారు.

ఐటీఐల అప్‌గ్రేడ్‌..

2024–25 విద్యా సంవత్సరం నుంచి ఐటీఐలను అప్‌గ్రేడ్‌ చేస్తూ వస్తున్న ప్రభుత్వం.. వాటిస్థానంలో ఏటీసీలను స్థాపిస్తూ వస్తోంది. ఇందుకోసం టాటా టెక్నాలజీస్‌ కంపెనీతో మానవ వనరుల తయారీకి ఒప్పందం కూడా కుదుర్చుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఐటీఐలను దశలవారీగా ఏటీసీలుగా తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 25 ఏటీసీలను శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తారు.

కోర్సులు.. కాల వ్యవధి..

అడ్వాన్స్‌డ్‌ వెల్డింగ్‌ (6 నెలలు), మెకట్రానిక్స్‌, ఆటోమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌(ఏడాది), ఏఐ–డ్రివెన్‌ మా న్యుఫ్యాక్చరింగ్‌, ఇండస్ట్రియల్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింక్స్‌ (ఐవోటీ – మూడు నెలలు), సీఎన్‌సీ ప్రోగ్రా మింగ్‌ (నాలుగు నెలలు), సైబర్‌ సెక్యూరిటీ ఫర్‌ ఇండస్ట్రీ కోర్సులు అందుబాటులోకి తెస్తున్నారు. వీటితోపాటు మరిన్ని ప్రత్యేక ప్రోగ్రామ్స్‌లు.. క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ ట్రెయినింగ్‌ స్కీం(సీఐటీఎస్‌), అడ్వాన్స్‌డ్‌ వొకేషనల్‌ ట్రెయినింగ్‌ స్కీం(ఏవీటీఎస్‌) ద్వారా ఇండస్ట్రియల్‌ వర్కర్లకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు.

విద్యార్థులకు అనేక ప్రయోజనాలు..

విద్యార్థుల్లో స్కిల్స్‌ ఆధారంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఏటీసీలో శిక్షణ ముగిసిన తర్వాత కోర్సులకు అనుగుణంగా అప్రెంటిషిప్‌ అవకాశం కల్పిస్తారు. ఈసమయంలో స్టైఫండ్‌ కూడా చెల్లిస్తారు. నైపుణ్యం గలవారికి నేరుగా ప్లేస్‌మెంట్‌ ఇస్తారు. 90శాతం తమ కంపెనీల్లోనే ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.

ఎలిజిబిలిటీ.. అడ్మిషన్‌ ప్రక్రియ..

ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఏటీసీలలో ప్రవేశాలు పొందవచ్చు. అయితే, 18–35 ఏళ్ల మధ్యలో వయసు కలిగినవారు మాత్రమే ఇందుకు అర్హులు. పదో తరగతి/ఐటీఐ ఉత్తీర్ణత, ఇంగ్లిష్‌, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో పరిజ్ఞానం కలిగి ఉండాలి. సీట్ల సంఖ్యను బట్టి మూడు విడుతల్లో మెరిట్‌ ప్రాతిపదికన ఏటీసీల్లో సీట్లు కేటాయిస్తారు.

ఏటీసీల లక్ష్యం ఇదే..

పరిశ్రమల్లో మానవ వనరుల అవసరాలు తీర్చేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇదేసమయంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యమని అంటున్నారు. ఒకవేళ ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే.. స్వయం ఉపాధి పథకంలో భాగంగా కుటీర పరిశ్రమలు స్థాపించుకునే వీలు కల్పిస్తారు. ఐటీఐలో బేసిక్‌ ట్రెయినింగ్‌ పూర్తి చేసిన వారికి ఆధునిక స్కిల్స్‌ (ఏఐ, రోబోటిక్స్‌, డిజిటల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌) అందించి ఉద్యోగ, స్వయం ఉపాధి కల్పిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement