
పత్తి రైతుకు మద్దతు ధర
● మార్కెట్‌కు నాణ్యమైన పత్తినే తేవాలి ● మద్దతు రాకుంటే సీసీఐలో విక్రయించాలి ● జిల్లాలో ఐదు సీసీఐ కేంద్రాల ఏర్పాటు ● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: జిల్లాలో పత్తి సాగుచేసి రైతులకు అక్టోబర్ 15 నుంచి దిగుబడి చేతికి వచ్చే అవకాశం ఉందని, మార్కెట్‌కు తీసుకొచ్చే నాణ్యమైన పత్తికి ప్రభుత్వ మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని, మార్కెట్‌లో మద్దతు ధర రాలేదని రైతు భావిస్తే సీసీఐలో విక్రయించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ వేణుతో కలిసి పత్తి కొనుగోళ్లపై అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో 48,215 ఎకరాల్లో పత్తి సాగైందని, 5,78,580 క్వింటాళ్ల దిగుబడి వచ్యేచ అవకాశం ఉందని తెలిపారు. నవంబర్, డిసెంబర్ వరకు పత్తి విక్రయానికి వచ్చే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం ఐదు సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశామని, 8శాతం తేమ ఉంటే కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.8,110 వస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. పెద్దపల్లి మార్కెట్ యార్డుతోపాటు పెద్దపల్లిలో రెండు, సుల్తానాబాద్‌లో ఒకటి, కమాన్‌పూర్‌లో ఒక జిన్నింగు మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పత్తి నాణ్యతలో నిబంధనలపై ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. విక్రయాలకు రైతులు నిరీక్షించకుండా కపాస్ కిసాన్‌యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్‌రెడ్డి, డీఏవో శ్రీనివాస్, ఆర్టీవో రంగారావు తదితరులు పాల్గొన్నారు.