
బతుకమ్మ వేడుకల్లో డీజేలను నిషేధించాలి
● అడిషనల్ డీసీపీకి మహిళల వినతి
గోదావరిఖని: బతుకమ్మ ఉత్సవాల్లో డీజే సౌండ్స్‌ను అరికట్టాలని శ్రీసీతారామ సేవాసమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ కోరారు. శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డీసీసీ(అడ్మిన్) శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ రమేశ్‌కు ఫిర్యాదు అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల బతుకమ్మ ఆడుతున్న ఇద్దరు మహిళలు, మితిమీరిన డీజే సౌండ్‌తో గుండెపోటుతో మృతి చెందిన ఘటనను గుర్తుచేశారు. ఇలాంటి సంఘటనలు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. డీజే సౌండ్స్‌తో వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులతోపాటు గుండె సమస్యలు ఉన్నవారికి తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తున్నాయని అన్నారు. దీనిపై స్పందించిన పోలీస్ అధికారులు.. తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో సమితి సభ్యులు కంది సుజాత, బిల్ల శ్రీదేవి, రమాదేవి, శ్యామల తదితరులు ఉన్నారు.