
● ఎన్నికల్లో విజయం సాధించిన కార్మిక సంఘ్
జ్యోతినగర్(రామగుండం): ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎన్టీపీసీ కార్మిక సంఘ్ (బీఎంఎస్ అనుబంధం) విజయం సాధించింది. గురువారం ప్రాజెక్టు పరిపాలన భవనంలో ఎన్నికలు నిర్వహించారు. ప్రాజెక్టులో 212 మంది ఉద్యోగులు ఓటర్లుగా ఉన్నారు. ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ (ఐఎన్టీయూసీ), ఎన్టీపీసీ కార్మిక సంఘ్ (బీఎంఎస్), ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) బరిలో నిలిచాయి. 212 మందికి గాను 208 ఓట్లు (98 శాతం పోలింగ్) నమోదయ్యాయి. బీఎంఎస్‌కు 102, ఐఎన్టీయూసీ 94, సీఐటీయూకి 12 ఓట్లు రాగా, బీఎంఎస్ అనుబంధ కార్మిక సంఘ్ 102 ఓట్లతో ప్రాతినిధ్య సంఘంగా అర్హత పొందడంతో పాటు ఒక ఎన్బీసీ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఐఎన్టీయూసీ 94 ఓట్లతో రెండో ఎన్బీసీ స్థానానికి పరిమితమైంది. రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి కందుల సంధ్యారాణి విజయోత్సవ ర్యాలీలో పాల్గొని ఉద్యోగులను అభినందించారు. కార్మిక సంఘ్ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సాగర్‌రాజు, చల్లా సత్యనారాయణరెడ్డి, పోగుల స్వామి తదితరులు పాల్గొన్నారు.