
పల్లెప్రగతి వైపు అడుగులు
గ్రామాల్లో మౌలిక వసతుల లెక్క పక్కాగా.. 21 అంశాలతో పనుల గుర్తింపు ప్రక్రియ ప్రత్యేక యాప్‌లో వివరాల నమోదు గ్రామ పంచాయతీల్లో మొదలైన సర్వే
మంథనిరూరల్: ప్రతీ పల్లెను ప్రగతిబాటలో నడిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. గ్రామీణులకు అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై కచ్చితమైన సమాచార సేకరణలో నిమగ్నమైంది. ఈ క్రమంలో ప్రతీగ్రామంలో పంచాయతీ కార్యదర్శులు మౌలిక వసతులపై సర్వే ప్రక్రియ ఇటీవల ప్రారంభించారు. ఇలా సేకరించిన మౌలిక వసతుల సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇందుకోసం 21 అంశాలతో కూడిన ప్రత్యేక యాప్‌ను రూపొందించగా.. ప్రతీ అంశాన్ని అందులో నమోదు చేస్తున్నారు.
మొదలైన సర్వే ప్రక్రియ..
జిల్లాలోని 14 మండలాల్లో 266 గ్రామపంచాయతీలు ఉండగా.. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో సర్వే ప్రక్రియ మొదలైంది. పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రంథాలయాలు, పశువైద్య ఉపకేంద్రాలు, పాఠశాల భవనాలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, నర్సరీలు, క్రీడా ప్రాంగణాలు, కుళాయిలు, బోర్లు, అంతర్గత రహదారులు, డ్రైనేజీల.. ఇలా ప్రగతికి అవసరమైన అన్ని వసతులపైనా సర్వే కొనసాగుతోంది.
ప్రత్యేక యాప్‌లో నమోదు..
గ్రామాల్లో మౌలిక వసతుల గురించి సమాచారం తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూ పొందించింది. గ్రామపంచాయతీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ పేరిట రూపొందించిన ఈ యాప్‌లోనే పంచాయతీ కార్యదర్శులు.. తాము సేకరించిన వివరాలు నమోదు చేస్తున్నారు. డెయిలీ శానిటేషన్ రిపోర్ట్‌తోపాటు 21 అంశాల్లో మౌలిక వసతుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
వసతుల లెక్క పక్కాగా..
గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై పక్కాగా లెక్క ఉండేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఎలాంటి సమస్యలు ఉన్నాయి. ప్రజావసరాలు తీర్చేలా ఎటువంటి వసతులు కల్పించాలనే అంశాలు తెలిసేలా చర్యలు చేపట్టింది. దీంతో రాబోయే రోజుల్లో గ్రామాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనతో ప్రగతి బాటలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
త్వరలో పూర్తిచేస్తాం
గ్రామాల్లో వసతులు, అమలవుతున్న ప్రణాళికలపై పంచాయతీ కార్యదర్శులు సర్వే ప్రారంభించారు. మరో రెండు, మూడురోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. రాష్ట్ర పంచాయతీ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక యాప్‌లో గ్రామ ప్రగతికి అవసరమైన వసతులను నమోదు చేస్తున్నారు.
– అనిల్‌రెడ్డి, ఎంపీవో, మంథని