
ఉరుములు.. మెరుపులు.. భారీవర్షం
● లోతట్టు ప్రాంతాలు జలమయం ● విద్యుత్ సరఫరాకు అంతరాయం
పెద్దపల్లిరూరల్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కాసేపు కుండపోతగా పడింది. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ వెనకాల ఇందిరానగర్ రోడ్డుపై వర్షపునీరు ప్రవహించడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని కాలనీకి చెందిన అల్తాఫ్ పేర్కొన్నారు.
ఓదెల(పెద్దపల్లి): కొలనూర్, గోపరపల్లె, ఉప్పరపల్లె, ఓదెల, పొత్కపల్లి, శానగొండ, గుంపుల గ్రామాల్లో ఉరుములు, మెరుపులతతో కూడిన వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
విద్యుత్ సరఫరాకు అంతరాయం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): వివిధ గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. దీంతో రెండు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వ్యవసాయదారులు, కూలీలు వర్షంలో తడిసి ముద్దయ్యారు.