
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
● యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ● జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్
జ్యోతినగర్(రామగుండం): సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్ సూచించారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌షిప్ కాకతీయ ఆడిటోరియంలో మంగళవారం యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయన జ్యోతిప్రజ్వలన చేసి మాట్లాడారు. నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం అందిస్తున్న బ్యాంకు రుణాలతో చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపించాలన్నారు. తద్వారా యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన సూచించారు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం జిల్లా పరిశ్రమల శాఖ వద్ద మరింత సమాచారం పొందేందుకు యువత ముందుకు రావాలని ఆయన సూచించారు. సదస్సులో యూనియన్ బ్యాంక్ డీజీఎం అపర్ణరెడ్డి, జిల్లా పరిశ్రమల అధికారి కీర్తికాంత్, ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ తాజ్ తదితరులు పాల్గొన్నారు.