
ఆశావహులకు కలిసొచ్చేనా?
‘అన్నా.. దసరా పండుగ వస్తంది.. మన ఊరిలో అమ్మవారి విగ్రహం పెడుతున్న.. జర చందా రాయండి.. వచ్చే ఎన్నికల్లో మీరు పోటీచేసేవాళ్లు.. మీరు గెలవాలంటే ముందుపడాలి’ అంటున్నారు దుర్గాదేవి మండప నిర్వహకులు..
స్థానిక ఎన్నికల రిజర్వేషనపై మార్గదర్శకాలు విడుదల జెడ్పీ నుంచి సర్పంచ్ వరకూ మారనున్న సమీకరణలు ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం ముమ్మర కసరత్తు నెలాఖరులోగా షెడ్యూల్ విడుదలవుతుందని ప్రచారం
‘తమ్మీ రిజర్వేషన్ కలిసోస్తే పోటీచేస్త.. ప్రభుత్వం రోజుకో మాట చెబుతంది.. ఎన్నికలు నిర్వహిస్తారనుకొని ఇప్పటికే అడిగిన ప్రతీవారికి వినాయక చంద రాసిన.. అన్నదానం చేయించిన.. ఇప్పుడు పెద్దపండుగ దసరా వచ్చే.. సరే.. రాసుకో తమీ.. రిజర్వేషన్ కలిసిరాకపోతుందా.. నేను పోటీచేయకపోతనా.. నన్నైతే గుర్తుంచుకో’ అంటున్నారు ఆశావహులు.
జిల్లా సమాచారం
సాక్షి పెద్దపల్లి: ప్రభుత్వం స్థానిక ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఆదివారం రిజర్వేషన్లపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇక ఎన్నికల నిర్వహణ స్పష్టమైందనే భావనంతో జిల్లాలోని అన్ని పల్లెల్లో ఎక్కడ నలుగురు కలిసినా రిజర్వేషన్లు, ఎన్నికలపైనే ముచ్చటిస్తున్నారు.
జెడ్పీ చైర్మన్ బీసీలకేనా..?
పంచాయతీరాజ్ ఆదివారం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈమేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక సంస్థల అధికారులతో సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను కలెక్టర్, ఎంపీటీసీ, సర్పంచ్ పదవులకు ఆర్డీవో, వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు వార్డులల్లోని కులాల వారీగా మా ర్కింగ్ చేసుకుని రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే ఆధారంగా బీసీలకు 42శాతం, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించ నున్నారు. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన సీట్లను మినహాయించి, మిగిలిన కేటగిరీల్లోని స్థానాల్లోనే బీసీలకు అదనంగా కోటా కల్పించనున్నారు. దీంతో గతంలో బీసీలకు కేటయించిన స్థానాలతోపాటు మరికొన్ని స్థానాలు పెరగనుండటంతో ఏయే ఏయే స్థానాలు బీసీలకు కేటాయించనున్నారోననే చర్చ ఆశావాహుల్లో కొనసాగుతోంది. గతంలో కేటాయించిన మహిళా రిజర్వేషన్లుకు తోడు 50శాతానికి తగ్గకుండా లాటరీ పద్ధతిన వారికీ రిజర్వేషన్ వర్తింపజేస్తారు. దీంతో జెడ్పీ చైర్మన్ కుర్చీ బీసీలకే దక్కనుంది. అయితే, బీసీ జనరల్ అవుతుందా? లేదా బీసీ మహిళకు కేటాయిస్తారా? అనేదానిపై ఆశావాహులు అంచనా వేసుకుంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా రిజర్వేషన్లు ప్రకటించేవరకు ఎవరికి తోచినట్లు వారు లెక్కలు వేసుకోవడం కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు.
తొలుత పరిషత్ ఎన్నికలే..
ఈనెల 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి గడవు విధించిన విషయం విదితమే. ప్రభుత్వం మరింత గడువు కోరాలని చూస్తూనే, మరోపక్క ఎన్నికల నిర్వహణకూ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల వివరాలు ప్రకటించింది. తొలుత పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతుండడంతో తాము పోటీ చేయదల్చుకున్న స్థానంలో రిజర్వేషన్ ఎలా ఉంటుందనే విషయంపై స్పష్టత లేక ఆశావహులు సందిగ్ధ పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
పంచాయతీలు
263
వార్డులు
2,432
ఎంపీటీసీలు
137
జెడ్పీటీసీలు
13
మొత్తం ఓటర్లు
4,04,181
పురుషులు
1,98,728
మహిళలు
205439
ఇతరులు
14