
దీపావళి బోనస్
బొగ్గు గని కార్మిక సంఘాల సమాయత్తం కోలిండియా యాజమాన్యంతో 22న భేటీ నేడు ఖరారు కానున్న పండుగ బోనస్ గతేడాది ఒక్కో కార్మికుడికి రూ.93,750 చెల్లింపు
పెంపుపై పట్టు
పదేళ్లలో దీపావళి(పీఎల్‌ఆర్) బోనస్ చెల్లింపు(రూ.లలో)
ఏడాది పెరిగింది చెల్లింపు
2014 5,000 40,000
2015 8,500 48,500
2016 5,500 54,000
2017 3,000 57,000
2018 3,500 60,500
2019 4,200 64,700
2020 3,800 68,500
2021 4,000 72,500
2022 4,000 76,500
2023 8,500 85,000
2024 8,750 93,750
గోదావరిఖని(రామగుండం): దేశంలోని బొగ్గుగని కార్మికులకు దీపావళి బోనస్‌పై కార్మిక సంఘాలు కోలిండియా యాజమాన్యంతో భేటీ కానున్నాయి. ఈనెల 22న కార్మిక సంఘాలు, కోలిండియా యాజమాన్యంతో సమావేశమై చెల్లింపుపై చర్చించనున్నాయి. గతేడాది బోనస్ కింద ప్రతీ కార్మి కుడికి రూ.93,750చెల్లించారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లోని బొగ్గుగని కార్మికులకు ఈబోనస్ ను ఏటా దీపావళి సందర్భంగా అందించడం ఆనవాయితీ. ఈసారి బోనస్‌పై చర్చించేందుకు జేబీసీసీఐ కార్మిక సంఘాలు కోలిండియా యాజమాన్యంతో ఢిల్లీలో సమావేశం కానున్నాయి.
రూ.లక్షకు పైగా చెల్లించాలని..
ఈసారి దీపావళి బోనస్ ఒక్కో కార్మికునికి రూ.లక్షకుపైగా చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఢిల్లీలో జరిగే చర్చల్లో జేబీసీసీఐ సంఘాలు, కోలిండియా యాజమాన్యం చర్చలు జరిపి కార్మికులకు చెల్లించే మొత్తాన్ని ఖరారు చేయనున్నాయి.
దసరా అడ్వాన్స్ చెల్లింపులకు ఆదేశాలు
సింగరేణి కార్మికులకు దసరా పండుగ అడ్వాన్స్ చెల్లించేందుకు యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. పండుగ ఖర్చుల కోసం అడ్వాన్స్ అందజేసి తర్వాత వారి వేతనాల్లో యాజమాన్యం రికవరీ చేస్తూ వస్తోంది. ఏటా కార్మికులకు యాజమాన్యం పండుగ కోసం ముందస్తు చెల్లింపు జరుపుతోంది. ఈమేరకు సీఆర్‌పీ/పీఈఆర్/ఐఆర్/ఎఫ్/201/ 1123 పేరున శనివారం ఆదేశాలు జారీఅయ్యాయి. పర్మినెంట్ కార్మికులకు రూ. 25వేలు, బదిలీ వర్కర్లకు రూ.12,500 దసరా అడ్వాన్స్ చెల్లించేందుకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 2న బోనస్ సొమ్మును కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేయనుంది.
నేడు సింగరేణి కార్మికుల లాభాల ప్రకటన : సీఎండీ
2024–25 ఆర్థిక సంవత్సరం సింగరేణి కార్మి కుల లాభాలను సోమవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ప్రకటించనున్నట్లు సంస్థ సీఎండీ ఎన్.బలరాం తెలిపారు. ఉదయం 10.40 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాభాలను ప్రకటిస్తారని, కార్మికుల వాటా కూడా ఈసందర్భంగా ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. కోల్‌బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు వివరించారు.
2.60లక్షల మంది కార్మికులు
దేశవ్యాప్తంగా సుమారు 2.60లక్షల మంది బొగ్గుగని కార్మికులు ఉండగా, సింగరేణి బొగ్గు గనుల సంస్థలో దాదాపు 40వేల మంది ఉద్యోగులకు తాజాగా చేసుకునే ఒప్పందం వర్తించనుంది. గత ఒప్పందం ప్రకారం ఒక్కో కార్మికునికి రూ.93,750 బోనస్ చెల్లించగా, ఈసారి దీన్ని మరింత పెంచాలని కార్మి క సంఘాలు చర్చల్లో పట్టుబట్టే అవకాశం ఉంది. కోలిండియాతో ముడిపడి ఉన్న దీపావళి బోనస్‌పై యాజమాన్యం, జేబీసీసీఐ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, బీఎంఎస్, హెచ్‌ఎంఎస్, సీఐటీయూ చర్చించనున్నాయి.