
పండుగ వేళ.. మిరిమిట్లు గొలిపేలా..
సుల్తానాబాద్(పెద్దపల్లి): పండుగల వేళ గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న చీకట్లు త్వరలో తొలగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వీధి దీపాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండగా, వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఉపశమనం లభించింది. అవసరం ఉన్నచోట కొత్త వాటిని ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించిన విషయం తెలిసిందే. వాటి అన్ని బాధ్యతలను ఎంపీడీవోలు, ఎంపీవోలు, అదనపు కలెక్టర్లు చూడాలని సూచించారు. కాగా, కొన్ని నెలలుగా పురపాలికలు, పల్లెల్లో పాలకవర్గాలు లేక వీధి దీపాలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
ఇరవై శాతం పైగా వెలగని లైట్లే..
జిల్లా కేంద్రంలో మొత్తం 11,234 వీధి దీపాలు ఉన్నాయి. వాటిలో సుమారు వెయ్యికి పైగా వెలగడం లేదనే ఆరోపణలున్నాయి. సెంట్రల్ లైటింగ్ సైతం ఏర్పాటు చేసినా అక్కడక్కడ వెలగడం లేదు. పండుగల సీజన్ కావడంతో వాటన్నింటికీ మరమ్మతులు చేసే అవకాశం ఉంది.
జీపీ సెక్రటరీలకు తప్పనున్న కష్టాలు
గ్రామాల్లో పాలకవర్గాలు లేక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. దీంతో భారమంతా పంచాయతీ కార్యదర్శులపై ఉండడంతో మౌలిక వసతుల కల్పనకు ఇబ్బందులు పడ్డారు. వీధి దీపాలు, వాటి విద్యుత్ బిల్లులను సైతం వారి జేబులో నుంచి ఖర్చు చేస్తున్నారు. సీఎం నిర్ణయంతో తమకు భారం తప్పినట్లేనని పలువురు కార్యదర్శులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కొన్ని ప్రాంతాల్లో లైట్లు లేక ఇబ్బంది పడుతుండగా, కొన్ని చోట్ల 24 గంటలూ వెలుగుతూనే ఉంటాయి. వాటి విద్యుత్ వృథాను అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం ఆదేశించారు.
జిల్లాలో 54,640..
జిల్లావ్యాప్తంగా 266 గ్రామపంచాయతీల్లో సుమారు 54,640 వీధి దీపాలు ఉన్నట్టు జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య తెలిపారు. పలు చోట్ల వెలగనివాటికి మరమ్మతు చేసినట్లు పేర్కొన్నారు. లైట్లు వెలగకుంటే వెంటనే పంచాయతీ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలని కోరారు.