
అడవిని పంచుకుని వేట
విద్యుత్ ఉచ్చులతో జీవరాశుల హతం బోరంపల్లికి చెందిన యువకుడి మృతితో వెలుగు చూసిన ఘటన గతేడాదిలో జరిగిన యువకుడి మృతి మిస్టరీని ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన కాటారం డీఎస్పీ సూర్యనారాయణ
కాళేశ్వరం: అడవి జీవరాశులను చంపడానికి వేటగాళ్లు బరితెగించారు. తమ పరిధిలోని అడవిని కొంతభాగం పంచుకున్నారు. ఒకరి పరిధిలోకి మరో వేటగాళ్ల ముఠా రాకుండా ఒప్పందం చేసుకుని మరీ యథేచ్ఛగా వేటాడుతున్నారు. ఈ క్రమంలో గతేడాదిలో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బోరంపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు గోదావరి దాటి అమ్మమ్మ ఇంటికి చేరుకునే మార్గంలో అడవిలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులకు తగిలి అక్కడికక్కడే ప్రాణం వదిలిన ఘటన మహదేవపూర్ మండలం మద్దులపల్లి సమీపంలోని బల్జాపూర్ శివారులో జరిగింది. ఈ ఘటనను పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం కాళేశ్వరం పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాటారం డీఎస్పీ ఎ.సూర్య్యనారాయణ, మహదేవపూర్ సీఐ ఎన్.వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు.. గతేడాది మే 31న బోరంపల్లి గ్రామానికి చెందిన దుర్గం ప్రవీణ్(29) గోదావరి దాటి అడవి మార్గం గుండా మద్దులపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వస్తున్నాడు. మార్గంమధ్యలోని అడవిలో వేటగాళ్లు అడవి జంతువులను చంపడానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు అమర్చిన ఇనుప (జే వైర్) తీగల ఉచ్చులకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అప్పటి నుంచి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం అడవిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మద్దులపల్లికి చెందిన చకినారపు సంతోష్, వేల్పుల నాగరాజు, కొరళ్ల శేఖర్, చకినారపు బాపు, వేల్పుల సురేశ్, చకినారపు శ్రీనివాస్ పోలీసులకు తారసపడ్డారు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా.. తాము ఉచ్చులు పెట్టామని, సదరు యువకుడి మృతికి కారణమని ఒప్పకున్నారు. వీరంతా కొన్ని సంవత్సరాలుగా అడవిలో విద్యుత్ తీగలు అమర్చి అడవి జంతువులను చంపి వాటిని తినడం, మాంసం విక్రయించడం చేస్తున్నారు. దీంతో ఆ ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.