
పిక్కలు తీస్తున్న కుక్కలు
దడ పుట్టిస్తున్న వీధికుక్కలు రోడ్లపై గుంపులుగా సంచారం వణికిపోతున్న చిన్నారులు, వృద్ధులు సంతాన నియంత్రణను పట్టించుకోని యంత్రాంగం
కరిచినచోట సబ్బుతో శుభ్రం చేయాలి.
గాయం తీవ్రతను బట్టి వైద్యం చేస్తారు.
కుక్కకాటును రెండు రకాలు.
పెంపుడు కుక్క కరిస్తే ఇది వరకే వ్యాక్సినేషన్ వేయించారా? లేదా? అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని వైద్య చికిత్స అందిస్తారు.
వీధికుక్క కరిస్తే శరీరంపై కరిచిన భాగాలను బట్టి తప్పనిసరిగా ఇమ్యునోగ్లోబిన్, వ్యాక్సినేషన్ ఇచ్చి ఆ తర్వాత వైద్య చికిత్స కొనసాగిస్తారు.
సాక్షి పెద్దపల్లి: జిల్లాలో వీధికుక్కలు హడలెత్తిస్తున్నాయి. నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో గుంపులుగా తిరుగుతూ పిల్లలు, వద్ధులపై దాడులు చేస్తున్నాయి. నిత్యం ఎక్కడో ఓచోట కుక్కకాటుతో బాధితులు ఆస్పత్రుల్లో చేరుతూనే ఉన్నారు. శున కాలు పగలు, రాత్రి తేడా లేకుండా రహదారులపై సంచరిస్తూ దడ పుట్టిస్తున్నాయి. ఒంటరిగా వెళ్లాలంటే జనాలు భయాందోళనకు గురవుతున్నారు.
గాయాలు.. నరకయాత..
కుక్కల దాడుల్లో చిన్నగాయాలతో బయటపడ్డవాళ్లు కొందరైతే.. ముఖం, కాళ్లు, శరీరంపై లోతైనా గాయాలతో నరకయాతన అనుభవిస్తున్నవారు మరికొందరు. జిల్లావ్యాప్తంగా ఏ వీధిలో చూసినా పాతికకు తక్కువ కాకుండా శునకాలు కలిసి స్వైరవిహారం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దంపండుతోంది. అందులో ఏది మంచిదో, ఏది వ్యాధి సోకినదో తెలియని పరిస్థితి నెలకొంది. కుక్కకాటుకు గురై ప్రభుత్వ, పైవ్రేట్ ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య ఇటీవల అధికంగానే నమోదు అవుతోంని వైద్యులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి ఇప్పటివరకు 2,027 కుక్కకాటు కేసులు నమోదయ్యాయి. అంటే సరాసరిన రోజుకు 12మంది కుక్కకాటు బారినపడ్డారు. గోదావరిఖని ఏరియా ఆస్పత్రిలో 80 కుక్కకాటు కేసులు నమోదయ్యాంటేనే పరిస్థితి ఎంతతీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని నగరవాసులు పేర్కొంటున్నారు.
చికెన్ వ్యర్థాలతోనే..
చికెన్ వ్యర్థాలు, వృథా ఆహారం ఎక్కువగా లభించే ప్రాంతాల్లో కుక్కల బెడద అధికంగా ఉంది. ఫంక్షన్‌హాళ్లు, మటన్, చికెన్ షాపుల వద్ద వ్యర్థాలను తినేందుకు అలవాటు పడ్డాయి. అక్కడ ఆహారం లభించకుంటే జనావాసాల వైపు తరలివస్తున్నాయి. ఆ సమయంలో చేతిసంచితో వెళ్లే ప్రజలపై విరుచుకుపడుతున్నాయి. వాటిని ప్రతిఘంటించలేక అనేకమంది గాయాలపాలవుతున్నారు.
నియంత్రణ అంటే వణుకు..
సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. వీధికుక్కలన్నింటికీ స్థానిక సంస్థల అధికారులు రేబిస్ టీకాలు వేయించాలి. సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయించాలి. కానీ, అవేవీ అమలుకు నోచుకోవడం లేదు. కుక్కలకు ప్రాణహాని కలిగిస్తే తమ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని అధికారులు వాటి జోలికి పోవడానికి వణుకుతున్నారు. అలా అని.. కుక్కల బెడద తగ్గించడానికి అయ్యే వ్యయం మున్సిపాలిటీలు, పంచాయతీలకు భారంగా పరిమణిస్తోంది. స్థానిక సంస్థల్లో ప్రత్యేకాధికారుల పాలనతో నిధులలేమితో పాటు పర్యవేక్షణ కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామగుండంలో యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని నిర్మిస్తుండగా, నిధుల లేమితో జిల్లాలోని మరో మూడు బల్దియాల్లో వాటిజోలికే పోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
జిల్లాలో నమోదైన కుక్కకాటు కేసులు
2022
2,383
2023
2,611
2024
2,833
2025
2,027
నిర్లక్ష్యం చేయవద్దు
కుక్క కరిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి. లేదంటే రేబిస్ సోకే అవకాశాలు ఉంటాయి. ఇంటివద్ద, పనిప్రదేశాల్లో కుక్కలకు దూరంగా ఉండండి. పెంపుడు కుక్కలు సైతం ఇతరులను కరవకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి.
– వాణిశ్రీ, డీఎంహెచ్‌వో
కుక్క కరిస్తే ఏం చేయాలంటే..

పిక్కలు తీస్తున్న కుక్కలు