
విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి సారించాలి
ఎలిగేడు(పెద్దపల్లి): రైతులు విత్తనోత్పత్తిపై దృష్టి సారించాలని కూనారం, ఏరువాక శాస్త్రవేత్తలు సతీశ్‌చంద్ర, హరికృష్ణ అన్నారు. గురువారం మండలంలోని ర్యాకల్‌దేవుపల్లి, ఎలిగేడు, శివపల్లి గ్రామాల్లో వరిపంటలను పరిశీలించారు. ఈసందర్భంగా రైతులకు విత్తన ఉత్పత్తిలో పాటించాల్సిన మెలకువలు, చీడపీడల నివారణ, సస్యరక్షణ చర్యలపై వివరించారు. ఈ పంట ద్వారా వచ్చే విత్తనాలను వచ్చే పంటకు ఆయా గ్రామాల్లోని ఇతర రైతులకు అందించాలని సూచించారు. నానో యూరియా పిచికారీ చేసిన పొలాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మండల వ్యవసాయ అధికారి ఎం.ఉమాపతి, ఏఈవోలు సురేశ్, గణేశ్ పాల్గొన్నారు.
తెగుళ్లు పరిశీలన
కమాన్‌పూర్(మంథని): నాణ్యమైన విత్తనం–రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా మండలంలోని గుండారం, రాజాపూర్, కమాన్‌పూర్, గొల్ల్లపల్లె గ్రామాల్లో రైతులు సాగు చేసిన వరి పంటలను గురువారం శాస్త్రవేత్తలు పరిశీలించారు. వరిలో ఆకునల్లి నివారణకు పైరుపై వాడే మందుల గురించి రైతులకు వివరించారు. శాస్త్రవేత్త సతీశ్‌చంద్ర, ఏవో రామకృష్ణ, ఏఈవో అనూష పాల్గొన్నారు.