
అడవి కాదు.. ఏఐ శ్రీరాంపూర్
అంతర్జాతీయ స్థాయిలో అడవిశ్రీరాంపూర్ నిలవాలి
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
ముత్తారం(మంథని): అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చేలా అడవిశ్రీరాంపూర్‌ను ఏఐ శ్రీరాంపూర్‌గా మారుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గురువారం రాత్రి ముత్తారం మండలంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే మొదటగా అడవిశ్రీరాంపూర్ జెడ్పీ పాఠశాలలో టీ ఫైబర్ ద్వారా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్, సీసీటీవీ సర్వేలెన్స్ సిస్టమ్‌ను టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్, కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇంటింటికీ ఇంటర్‌నెట్ సౌకర్యం కోసం రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో అడవిశ్రీరాంపూర్ ఏఐ ఫర్‌ప్లెక్సిటీ టూల్స్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్లడానికి కార్యాచరణ రూపొందించి అమలు చేశామన్నారు. టీవీలే స్మార్ట్ కంప్యూటర్లుగా మారి ఏఐ టూల్స్ ద్వారా సాంకేతి విద్య బోధనతో అమెరికా లాంటి దేశాలకు దీటుగా ఇక్కడి పిల్లలు ఆదర్శంగా నిలవాలన్నారు. జిల్లాలోని ఉపాధ్యాయులను, విద్యార్థులను ఏఐగా మారుస్తానని కలెక్టర్ చాలెంజ్‌గా తీసుకోవడం అభినందనీయమన్నారు. గ్రామంలో టీ ఫైబర్ ద్వారా రూ.1.28 కోట్లతో ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించామన్నారు. రాష్ట్రంలో మిగతా మూడు ప్రాజెక్టు గ్రామాల్లో ఏఐని పూర్తి చేస్తామన్నారు. అడవిశ్రీరాంపూర్ పాఠశాలలో అదనపు తరగతుల భవనం, మరమ్మతు, సౌకర్యాల కోసం రూ.30లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందు ధర్యపూర్ విద్యుత్తు సబ్‌స్టేషన్, తదితర పనులకు శంకుస్థాపన చేశారు. డీఈవో మాధవి, ఆర్డీవో సురేశ్, గ్రంథాలయ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఎంఈవో హరిప్రసాద్, తహసీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఎంపీడీవో సురేశ్, హెచ్‌ఎం ఓదెలు తదితరులు పాల్గొన్నారు.