● కోరుట్ల నుంచి ఐదుగురు కీలక మావో నేతలు
● చివరికి మిగిలింది తిప్పిరి తిరుపతే
● దక్కిన దళపతి పీఠం
కోరుట్ల: పీపుల్స్‌వార్ నుంచి మావోయిస్టులుగా రూపు మార్చుకున్న నక్సల్ ఉద్యమ పంథాతో కోరుట్లకు 50 ఏళ్ల విడదీయరాని అనుబంధం ఉంది. 1980–85 మధ్యకాలం కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా భారతీయ విద్యార్థి పరిషత్, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లు విద్యార్థి వర్గాల్లో తమ ఊపును కొనసాగించాయి. ఈ రెండు విద్యార్థి సంఘాల మధ్య పరస్పర వైరుధ్యాలు, గొడవలు, కొట్లాటలు, ఓ దశలో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలోనే ఐదుగురు ఆర్‌ఎస్‌యూ నాయకులు పీపుల్స్‌వార్ వైపు మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ ఐదుగురు కీలక నేతలుగా ఎదగగా.. వారిలో ఇద్దరి ఆచూకీ లేదు. మరో ఇద్దరు వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. ఇక మిగిలింది..తిప్పిరి తిరుపతి. ఆ ఒక్కనికే మావోయిస్టు దళపతి పీఠం దక్కింది.
ఐదుగురు కీలక నేతలే..
1980–90 దశకంలో కోరుట్లకు చెందిన ఆర్‌ఎస్‌యూ నేతలు తిప్పిరి తిరుపతి, ముక్కా వెంకటేశం, నిజాముద్దీన్, బెజ్జారపు కిషన్, పసుల రాంరెడ్డి కీలకంగా వ్యవహరించేవారు. ఇంటర్, డిగ్రీ పూర్తి అయ్యే సమయంలో వీరిపై పోలీసు నిర్భంధం పెరగడంతో సిద్ధాంతపరమైన భావజాలంతో అజ్ఞాతంలోకి వెళ్లారు. పీపుల్స్‌వార్‌లో కీలక నేతలుగా ఎదిగారు. ముక్కా వెంకటేశం నల్గొండ జిల్లా పీపుల్స్‌వార్ కార్యదర్శిగా పనిచేస్తూ 1996 అక్టోబర్‌లో యాదగిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్తున్న సమయంలో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. పసుల రాంరెడ్డి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కార్యదర్శి హోదాలో 2001లో సిరిసిల్ల జిల్లా మద్దిమల్ల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. నిజాముద్దీన్ మావోయిస్టు డెన్ కీపర్‌గా చాలారోజులు వ్యవహరించినట్లు సమాచారం. ఈ మధ్యకాలంలో నిజాముద్దీన్ ఆచూకీ ఎవరికీ తెలియడం లేదు. అసలు ఉద్యమంలో ఉన్నాడా..? లేడా..? అనే వివరాలు లేవు. బెజ్జారపు కిషన్ 1980–85లో బుల్లెట్ మోటార్‌సైకిల్ మెకానిక్‌గా కోరుట్ల, జగిత్యాల ప్రాంతాల్లో గుర్తింపు పొందారు. పీపుల్స్‌వార్‌లో చేరిన ఈయన మావోయిస్టు కేంద్ర కమిటీలో టెక్ విభాగం కార్యకలాపాలను పర్యవేక్షించారని పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయన ఆచూకీ లేదు. ఇక మిగిలిన తిప్పిరి తిరుపతి మహారాష్ట్ర, ఒడిశాల్లో దేవ్‌జీగా మావోయిస్టు కార్యకలాపాలు నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుపై అలిపిరి వద్ద దాడి, దంతెవాడ సమీపంలో పోలీసులను హతమార్చిన సంఘటనలకు వ్యూహాకర్తగా తిరుపతి పేరు పలుమార్లు వినవచ్చింది. కోరుట్లలో తమ్ముడు వెంకటి చనిపోయిన సమయంలోనూ తిరుపతి ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కరోనా సమయంలో ఒడిశా పరిసరాల్లోని ఆదివాసీబిడ్డ, ఉద్యమ సహచరి సృజనను ఆయన జీవిత భాగస్వామిగా చేసుకున్నట్లు సమాచారం. 2019–20లో కరోనా సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె మృతి చెందింది. అట్టడుగు స్థాయి నుంచి అఽధిపతి వరకు ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా మావో సిద్ధాంతలక్ష్యాలను వీడని తిరుపతికి మావోయిస్టు దళపతి పీఠం దక్కడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.
నిజాముద్దీన్
(ఫైల్)
బెజ్జారపు కిషన్(ఫైల్)
పసుల రాంరెడ్డి(ఫైల్)
ఆ ఒక్కడే.. అధిపతి
ఆ ఒక్కడే.. అధిపతి
ఆ ఒక్కడే.. అధిపతి