
గజాల్లో విక్రయం.. గుంటల్లో రిజిస్ట్రేషన్
వ్యయసాయ భూముల విక్రయాల్లో మార్పు నాలా కన్వర్షన్ చేయకుండా అమ్మకాలు నిర్మాణ అనుమతులు రావని తెలిసీ అంటగడుతున్న వైనం ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న వ్యాపారులు
సాక్షి పెద్దపల్లి:
పేద, మధ్యతరగతి ప్రజలు తమకు కూడా ఎంతోకొంత భూమి ఉంటే బాగుంటుందని ఆశపడుతుంటారు. వీరిఆశను రియల్ ఎస్టేట్ వ్యాపారు లు పామ్‌ల్యాండ్స్ పేరిట సొమ్ము చేసుకుంటున్నా రు. గజాల్లో భూములను విక్రయించి గుంటల్లో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా కూడా వర్తిస్తుందని చెప్పడంతో భూములు కొనుగో లు చేసేందుకు పట్టణవాసులు ఎగబడుతున్నారు. భూముల ధరలు విపరీతంగా పెరగడంతో ఎకరా ల్లో వ్యవసాయ భూములను కొనుగోలుచేసే పరి స్థితి లేదు. పిల్లల భవిష్యత్ కోసం ఉపయోగపడుతుందని దూరంగానైనా కొంత భూమి కొనుగోలు చేసేందుకు పేద, మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న రియల్టర్లు కొత్త వ్యాపారానికి తెరలేపుతున్నారు. జిల్లాలోని పలు మండలాల్లో నూతన అంకం తెరలేపగా, పలువురు తహసీల్దార్లు వ్యాపారులకు వత్తా సు పలుకుతున్నారు. వెంచర్లలో విక్రయాలు చేస్తు న్న ప్లాట్లలో భవిష్యత్‌లో నిర్మాణ అనుమతులు రా వని తెలిసి మరీ అంటగడుతుండటం గమనార్హం.
నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు..
అనాధికార లే అవుట్లను అదుపు చేయడంతోపాటు, ఆదాయానికి గండి పడకుండా, ప్రజలు రియల్లర్లు మోసాల బారినపడకుండా ప్రభుత్వం మెమో జారీ చేసింది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019, పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం పామ్ ప్లాట్లు అమ్మవద్దని స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. రెండు వేల చదరపు మీటర్లు లేదా 20 గుంటలు ఉంటే నే వ్యవసాయ భూమిగా పరిగణించాలంటూ గతంలో ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అలాగే వ్యవసాయ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయవద్దని స్టాంపులు, రిజిస్ట్రేష న్ల శాఖకూ ఆదేశాలు ఉన్నాయి. అయినా నిబంధనలకు విరుద్ధంగా కొన్ని తహసీల్దార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఫార్మ్ ప్లాట్లకు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు చేస్తుండడం గమనార్హం. మరోవైపు.. జీ వో నంబరు 131 ప్రకారం 2020 ఆగస్టు 31 తర్వాత అక్రమ లే అవుట్లలోని ప్లాట్లకు అనుమతులు ఇచ్చే దని లేదని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది. 10 శాతం పార్కులు, 30 శాతం రహదారుల కోసం స్థలాలు కేటాయించి లే అవుట్‌లు అభివృద్ధి చేయాలన్న నిబంధనలు పాటించకుండా కొందరు ఫార్మ్ ప్లాట్లు, అక్రమ లే అవుట్లు చేసి అమ్మకాలు జరుపుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. 0.20ఎకరాల కంటే తక్కువగా ఉన్న వ్యవసాయ భూమి అయితే ఆర్‌ఐ, తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, ఫొటో దిగి అప్‌లోడ్ చేయాలి. కానీ గుంట, రెండు, మూడు గుంటల భూమిని కూడా ఎటువంటి పరిశీలన లేకుండా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. వ్యాపారుల మాటలకు ఆకర్షితులవుతున్న కస్టమర్లు రూ.లక్షలు వెచ్చిస్తూ భవిష్యత్‌లో ఎటువంటి అనుమతులు రావని తెలియక పెద్దమొత్తంలో ఫార్మ్ ప్లాట్లు కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు.
నష్టాలను గుర్తించడం లేదు
అనుమతి లేని లేఅవుట్లలో స్థలాలను కొనుగోలు చేస్తున్న ప్రజలు ఇళ్లు కట్టుకునేందుకు భవిష్యత్ లో ఎదురయ్యేకష్టనష్టాలను గుర్తించడం లేదు. ఇలాంటి వాటిలో ఇంటి నిర్మా ణానికి బ్యాంకులు, ఇతర సంస్థలేవీ రుణా లు మంజూరు చేసేందుకు ముందుకురావు. డ్రైనేజీ నిర్మాణాలు, తాగునీరు, రోడ్లు, వి ద్యుత్ తదితర సౌకర్యాలు ఏమీ ఉండవు. కానీ, తక్కువ ధరకు సులువుగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని చాలామంది రిజిస్ట్రేషన్లు చే సుకుంటూ మోసపోతున్నారు. ఇదేవిషయ మై ఉన్నతాధికారులను సంప్రదించగా.. అ లా చేయడానికి వీలులేదని, అలాంటి వాటి ని గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.

గజాల్లో విక్రయం.. గుంటల్లో రిజిస్ట్రేషన్