ఇళ్ల మధ్య పిచ్చిమొక్కలు
గోదావరిఖని కేసీఆర్‌కాలనీలో ఎక్కడ చూసినా ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. ప్లాట్ యజమానులను రామగుండం బల్దియా అధికారులు గుర్తించి ఇప్పటి వరకు నోటీసులు కూడా జారీ చేయలేదని ఆరోపణలున్నాయి. ఖాళీ స్థలాల్లో నిత్యం పాములు సంచరిస్తుండడంతో కాలనీవాసులు భయందోళనలకు గురవుతున్నారు. పారిశుధ్య లోపంతో పందులు స్వైరవిహారం చేస్తున్నాయి.
విషాదంలో మృతుడి కుటుంబం
టెంటువేసిన ఇంటి ఎదుట విషాదంతో విలపిస్తున్న ఈ కుటుంబం గోదావరిఖని కేసీఆర్‌కాలనీకి చెందినది. చింతల దీపక్ అనే టెన్త్ స్టూడెంట్ ఈనెల 5న జ్వరం, జాండీస్ లక్షణాలతోపాటు గుండెపోటుతో మృతిచెందాడని వైద్య బృందం చెబుతోంది. ఐదేళ్ల క్రితం భర్తను కోల్పోయిన పుష్పలత అనే నిరుపేద మహిళ, ఇప్పుడు 15 ఏళ్ల కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంతో రోదిస్తోంది. తాను నివాసం ఉంటున్న కాలనీలో లోపించిన పారిశుధ్య సమస్యలతోనా..? తీవ్ర అనారోగ్యంతో తన కొడుకు మృతి చెందాడా..? తేల్చుకోలేక ఆవేదన చెందుతోంది.
పేరుకుపోయిన చెత్తాచెదారం
డివిజన్లలో పారిశుధ్యం మెరుగుపర్చడానికి వందరోజుల ప్రత్యేక కార్యాచరణతో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ, కేసీఆర్‌కాలనీలో పర్యటిస్తే అందుకు భిన్నంగా పారిశుధ్యం లోపాలు దర్శనమిస్తున్నాయి. ప్రధాన కాలువలు చెత్తచెదారంతో నిండి కనిపిస్తున్నాయి. కేసీఆర్‌కాలనీ, ప్రగతినగర్, సాయినగర్‌లో దోమల బెడద కంటిమీద కునుకులేకుండా చేస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఫాగింగ్ కూడా చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో ఈ కాలనీలో ఒకరికి డెంగీ పాజిటీవ్ వచ్చింది.
దోమలతో నరకం
దోమలతో భరించలేకపోతున్నాం. సూదులతో పొడిచినట్లు కుడుతున్నాయి. పగలు, రాత్రి నిద్రలేకుండా చేస్తున్నాయి. అందరికీ జ్వరాలే వస్తున్నాయి. పాముల భయంతో రోడ్డుమీద అడుపెట్టలేకపోతున్నాం. చిత్తడిగా పెరిగిన పిచ్చిచెట్లను తొలగించాలి.
– కత్తరమల్ల శంకరమ్మ, కేసీఆర్‌కాలనీ, గోదావరిఖని
స్పెషల్‌డ్రైవ్ చేపట్టాలి
కేసీఆర్‌కాలనీ, ప్రగతినగర్, సాయినగర్‌లో బల్దియా అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలి. దోమలతో విషజ్వరాలు ప్రబలకముందే అప్రమత్తం కావాలి. ఇప్పటికే టెన్త్ స్టూడెంట్ చనిపోవడంతో స్థానికులు భయంతో వణుకుతున్నారు. పారిశుధ్యం మెరుగుకు వారం పాటు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
– మిట్టపెల్లి మహేందర్, కేసీఆర్‌కాలనీ, గోదావరిఖని