
గోదావరిఖని(రామగుండం): మహిళా బైక్‌రైడర్లకు ట్రాఫిక్ పోలీసులు శ్రావణం చీర కానుక ప్రకటించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించిన మహిళలకు చీర, జాకెట్ అందజేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా వద్ద గురువారం పోలీసులు ప్రత్యేక తనిఖీ చేపట్టారు. హెల్మెట్ ధరించి.. నిబంధనలకు అనుగుణంగా బైక్ డ్రైవ్ చేస్తున్న మహిళలను గుర్తించి చీరలు అందజేసి సత్కరించారు.
ట్రాఫిక్ చలాన్లు, డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ పార్కింగ్ ఫైన్‌లే కాదు.. నిబంధనలు పాటించే వారిని గుర్తించి గౌరవిస్తామని రామగుండం ఏసీపీ సీహెచ్.శ్రీనివాస్ స్పష్టం చేశారు. మొదటి దఫాగా పదిమంది మహిళలను గుర్తించి చీరలు అందజేసినట్లు తెలిపారు. భర్త హెల్మెట్‌తో బైక్ నడుపుతుంటే.. వెనకాల కూర్చున్న భార్యకు కూడా చీర, జాకెట్ అందజేసి.. హెల్మెట్ పెట్టుకునేలా ప్రోత్సహించాలని ఏసీపీ కోరారు.
బట్టల దుకాణాల యజమానుల సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగిస్తామని వివరించారు. గతంలో పూలు అందజేసి అభినందిస్తే చాలామంది బాధపడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలకు చీర, జాకెట్, బైక్ నడిపే పురుషులకు ప్యాంట్, షర్ట్ దాతల సహకారంతో అందిస్తామని వివరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్‌ఐ హరిశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.