గోదావరిఖని(రామగుండం): ‘బైక్ ఆపి పక్కన పెట్టమ్మా.. అనగానే ఆడపడుచు ముఖంలో ఆందో ళన.. ఎక్కడ ఫైన్ వేస్తారో.. పాత చలాన్లు కట్టమంటారోనని అనుమానంతో అక్కడే నిల్చుంది.. మీరు హెల్మెట్ పెట్టుకుని బైక్ నడుపుతున్నందుకు అభినందిస్తున్నాం.. మీకు చీర బహుమతిగా ఇస్తున్నాం’.. అని ట్రాఫిక్ ఏసీపీ చెప్పడంతో సంబ్రమాశ్చర్యాలకు లోనయ్యారు మహిళా బైక్‌రైడర్లు. ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటిస్తున్న మహిళలకు చీర బహూకరించి గౌరవించారు. పవిత్ర శ్రావణ మాసం కావడం.. ట్రాఫిక్ పోలీసుల నుంచి చీర అందుకోవడంతో వారి సంతోషానికి అవధులు లేవు.
నిబంధనలపై చైతన్యం
గోదావరిఖని ట్రాఫిక్ పోలీసులు వినూత్న శైలిలో బైక్ రైడర్లను ట్రాఫిక్ నిబంధనలపై చైతన్య పరుస్తున్నారు. ఫైన్‌వేయడం, చలాన్లు కట్టమనడం, డ్రంకెన్‌డ్రైవ్ చేపట్టడమే కాదు. నిబంధనల ప్రకారం డ్రైవ్ చేసే వారిని అభినందిస్తామని నిరూపించారు. గురువారం స్థానిక ట్రాఫిక్ జంక్షన్ వద్ద రామగుండం ఏసీపీ సీహెచ్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్సై హరిశేఖర్ తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న పలువురు మహిళలను అభినందించడంతో పాటు చీర బహుమతిగా అందజేశారు.
అతివల ఆనందం
ట్రాఫిక్ పోలీసుల నుంచి చీర బహుమతిగా అందుకున్న మహిళలు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ‘మా క్రమశిక్షణకు ఈస్థాయిలో గుర్తింపు లభించడమనేది ఎంతో గౌరవంగా ఉందన్నారు. ఇది మరింత బాధ్యతతో ట్రాఫిక్ నియమాలు పాటించేలా చైతన్యం కలిగిస్తుంది’ అని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతతో పాటు అన్ని వయస్సుల వారికి సురక్షిత ప్రయాణంపై అవగాహన పెంచుతుందని అంటున్నారు.
బట్టలషాపు యజమానుల ప్రోత్సాహంతో..
ట్రాఫిక్ పోలీసుల సూచనల మేరకు కొంతమంది బట్టషాపుల యజమానులు ఉచితంగా చీరలు అందజేసేందుకు ముందుకు వచ్చారు. వేలకు వేలు పెట్టి ప్రచారం కన్నా ఓ మంచి పనికి తమకు సహకరించాలని కోరడంతో గోదావరిఖని లక్ష్మీనగర్‌లోని పలు షాపుల యజమానులు అంగీకరించారు. దీనిలో భాగంగా స్థానిక భువనేశ్వరి సిల్క్ నుంచి పది చీరలు తీసుకువచ్చి ట్రాఫిక్ నియమాలు పాటించిన ఆడపడుచులకు అందజేశారు.
హెల్మెట్ పెట్టుకో.. గిఫ్ట్ పట్టుకో..
మహిళా బైక్‌రైడర్లకు శ్రావణం చీర ఆఫర్
గోదావరిఖని ట్రాఫిక్ పోలీసుల వినూత్న అవగాహన
ఇదే విధానం కొనసాగిస్తాం
ట్రాఫిక్ నియమాలు పాటించే వారిని అభినందించాలని నిర్ణయించాం. గతంలో గులాబీ పువ్వు ఇచ్చే పద్ధతి కొనసాగేది. దీనివల్ల చాలామంది బాధపడిన సందర్భాలున్నాయి. శ్రావణమాసం కావడంతో ఆడపడుచులకు చీరలు అందించాలని ఆలోచించాం. ఈమేరకు బట్టల షాపు నుంచి స్పాన్సర్ తీసుకున్నాం. షాపు యజమాని ఇచ్చిన చీరలను షాప్ పేరుతో ఉన్న కవర్‌తో సహా అందజేశాం. ఇదే పద్ధతి రాబోయే రోజుల్లో కూడా కొనసాగిస్తాం. నిబంధనలు పాటించి ప్రతీఒక్కరు సురక్షితంగా గమ్యం చేరడమే మా లక్ష్యం.
– సీహెచ్.శ్రీనివాస్,
ఏసీపీ, ట్రాఫిక్ రామగుండం
క్రమశిక్షణకు కానుక