
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
● డెంగీ ప్రబలకుండా పకడ్బందీ చర్యలు
● డ్రై డే.. ఫ్రై డే రోజు ఇంటింటా సర్వే
● పరిసరాల శుభ్రతపై అవగాహన
● ‘సాక్షి’తో జిల్లా వైద్యాధికారి అన్నప్రసన్నకుమారి
పెద్దపల్లిరూరల్: వానాకాలమంటేనే వ్యాధుల కాలం.. వ్యర్థపు వస్తువుల్లో నీరు నిలిస్తే దోమలు, ఈగలు ఇతర క్రిములు వృద్ధి చెంది రోగాలు ప్రబలే అవకాశముంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటిని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అన్నప్రసన్నకుమారి పేర్కొన్నారు. ఇందుకోసం ఊరూరా ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు ఇంటింటికీ వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని, వ్యాధులను కట్టడి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక చర్యలు తీసుకునేలా ఆదేశాలిస్తున్నారని వివరించారు. ఈసందర్భంగా గురువారం ‘సాక్షి’తో మాట్లాడారు.
సాక్షి: సీజనల్ వ్యాధుల కట్టడికి తీసుకుంటున్న చర్యలు.?
డీఎంహెచ్‌వో: వానాకాలంలో వ్యాధులబారిన పడకుండా అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తున్నాం. ఇళ్ల ఆవరణలోని వ్యర్థాలలో వర్షపు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందకుండా తమ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.
సాక్షి: జిల్లాలో ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారా.?
డీఎంహెచ్‌వో: జిల్లాలో రోజూ ఫీవర్ సర్వే జరుగుతోంది. సాయంత్రం వరకు సిబ్బంది వివరాలతో కూడిన నివేదిక ఇస్తున్నారు.
సాక్షి : జ్వరపీడితులను గుర్తించి అందిస్తున్న సేవలు.?
డీఎంహెచ్‌వో: ఇంటింటా సర్వేకు వెళ్లిన సమయంలో జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తిస్తే వారినుంచి రక్తనమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నాం. వ్యాధిని బట్టి వారికి సేవలందిస్తూనే ఆ ఇంటి పరిసరాల ప్రజలకు వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
సాక్షి: ఫ్రై డే, డ్రై డే రోజున చేపట్టే కార్యక్రమాలు.?
డీఎంహెచ్‌వో: ఆశావర్కర్లు ఫ్రై డే, డ్రై డే రోజు ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య సమస్యలపై ఆరా తీస్తారు. ఆ రోజు కనీసం 30 ఇళ్లు సందర్శించి కుటుంబసభ్యుల ఆరోగ్యస్థితి తెలుసుకుని వారి నుంచి సంతకం తీసుకుంటారు.
సాక్షి: డెంగీ, విషజ్వరాలబారిన పడ్డవారికి అందించే సేవలు.?
డీఎంహెచ్‌వో: డెంగీ, విషజ్వరాల బాధితులకు పల్లె ప్రాంతాల్లోని పీహెచ్‌సీ, సబ్‌సెంటర్లు, పట్టణాల్లో ఆసుపత్రులు, బస్తీ దవాఖానాల్లో సిబ్బంది అందుబాటులో ఉండిి సేవలందిస్తున్నారు. అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉన్నాయి. దోమలబారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలి. దోమతెరలు వాడడం మేలు.
సాక్షి: ఇప్పటివరకు డెంగీ కేసులు గుర్తించారా.?
డీఎంహెచ్‌వో: జిల్లాలో ఇప్పటివరకు 10 డెంగీ కేసులు గుర్తించాం. అందులో కొన్ని వలసవచ్చిన వారివే. రాఘవాపూర్, గుంపుల, కొలనూర్ ప్రాంతాల్లో గుర్తించి వైద్యమందించాం. వారి ఇంటి పరిసరాల్లో ఉండే వారికి ౖపరీక్షలు చేయించాం.
సాక్షి: దోమల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు.?
డీఎంహెచ్‌వో: పంచాయతీ అధికారుల సమన్వయంతో దోమలను నిర్మూలించేలా చూస్తున్నాం. నీరు నిలవకుండా గుంతలు పూడ్చడం, డ్రైనేజీల్లో ఆయిల్‌బాల్స్ వేయడం, అవసరమైన ప్రాంతాల్లో ఫాగింగ్ చేయిస్తున్నారు.
సాక్షి: వైద్యసిబ్బందిని అప్రమత్తం చేసేందుకు అనుసరిస్తున్న పద్ధ్దతులేంటి.?
డీఎంహెచ్‌వో: వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు తమ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశాం. ప్రత్యేక బృందాలను సిద్ధంగా ఉంచాం. ఎప్పటికప్పుడు అందుతున్న సమాచారాన్ని బట్టి తమ సిబ్బంది సేవలందిస్తున్నారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తం