టీడీపీలో కలహాల కాపురం | - | Sakshi
Sakshi News home page

టీడీపీలో కలహాల కాపురం

May 29 2026 2:43 AM | Updated on May 29 2026 2:43 AM

పార్వతీపురంలో ఎమ్మెల్యేకు ఝలక్‌

పాలకొండలో రోడ్డెక్కిన విబేధాలు

పాలకొండలో టీడీపీ ఇన్‌చార్జి భూదేవికి వ్యతిరేకంగా ర్యాలీ

పార్వతీపురంలో ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం

సాక్షి, పార్వతీపురం మన్యం: మహానాడు వేదికగా వర్గపోరును బయట పెట్టుకుంటున్న తెలుగు తమ్ముళ్లు.. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు జయంతి రోజున గురువారం కూడా అదే రీతిలో తమ కలహాల కాపురాన్ని మరోసారి రచ్చకెక్కించారు. వర్చువల్‌గా, క్లస్టర్ల వారీ నిర్వహిస్తున్న మహానాడులో జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లోనూ వర్గాలుగా విడిపోయి, ఎవరికి వారు యమునా తీరే అన్న చందాన మమ అనిపించేశారు. కార్యక్రమాల్లో కార్యకర్తలు లేక, రెండో రోజు కూడా వెలవెలబోయిన దృశ్యాలే దర్శనమిచ్చాయి.

పార్వతీపురం నియోజక వర్గంలో ఎమ్మెల్యే విజయ్‌ చంద్ర వర్గానికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గట్టి ఝలక్‌ ఇచ్చారు. మండలంలోని పిన్నింటి రామినాయుడు వలసలో జైపాల్‌ అనే కార్యకర్త సొంత నిధులతో గతంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహం ప్రారంభోత్సవాన్ని ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకున్న విషయం విదితమే. దీనిపై అప్పట్లో పెద్ద వివాదం రేగింది. మరలా ఎన్టీఆర్‌ జయంతి రోజు అక్కడ విగ్రహాన్ని మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు ఆవిష్కరించారు. గతంలో ఎమ్మెల్యేను పిలిచినప్పటికీ ఆయన రాకపోవడంతో, మరో వర్గంతో విగ్రహావిష్కరణ పూర్తి చేశారు. మరలా వివాదాలు జరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందుగానే అక్కడికి చేరుకున్నారు. కార్యక్రమం ప్రశాంతంగా ముగియడంతో గ్రామస్తులు, అక్కడి పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని కృష్ణపల్లి తదితర ప్రాంతాల్లోనూ ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమాలను వేర్వేరుగా జరుపుకోవడం విశేషం.

కానరాని జిల్లా అధ్యక్షురాలు..

టీడీపీ అరకు పార్లమెంటు అధ్యక్షురాలు తేజోవతి రెండో రోజు కార్యక్రమంలోనూ జిల్లాలో ఎక్కడా కనిపించలేదు. అరకు ప్రాంతానికే ఆమె పరిమితమయ్యారు. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లోనూ ఆమెను దూరంగా పెట్టడం వల్లే ఎక్కడా పాల్గొనలేదని పార్టీ కార్యకర్తలు చర్చించుకున్నారు.

పాలకొండ నియోజక వర్గంలో గ్రూపులతో ఎప్పటికప్పుడు వీధికెక్కుతున్న తెలుగు తమ్ముళ్లు.. ఎన్టీఆర్‌ జయంతి రోజున కూడా తమ అసమ్మతి గళం వినిపించారు. టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, మాజీ క్లస్టర్‌ ఇన్చార్జి జాడ శ్రీధర్‌ ఆధ్వర్యంలో పాలకొండలో గురువారం భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ కోసం కష్టపడు తున్నా తమను గుర్తించకపోవడం, కనీసం మహానాడు కార్యక్రమాలకు ఆహ్వానించక పోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ర్యాలీలో వందలాది మంది పాల్గొన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి భూదేవిని బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement