పార్వతీపురం: బక్రీద్ పండగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు గురువారం తెలిపారు. బక్రీద్ త్యాగం, భక్తి, సమానత్వానికి ప్రతీక అని పేర్కొంటూ, జిల్లా ప్రజలందరూ ఆనందంగా పండగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని కోరుతూ ‘‘ఈద్ ముబారక్’’ తెలిపారు.
శతశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యం
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో వయోజన అక్షరాస్యత శతశాతం సాధించడమే లక్ష్యంగా ’అక్షర ఆంధ్ర – ఉల్లాస్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2029 నాటికి వయోజనులందరినీ విద్యావంతులను చేయడమే ఈ పథకం ఉద్దేశం కాగా.. ఈ మేరకు జిల్లా, మండల, మున్సిపల్ స్థాయిలలో పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేస్తూ కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 2026–27 విద్యా సంవత్సరంలో జిల్లాలో 71,194 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించారు. ప్రధానంగా 15 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల మహిళలు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. అధికారులంతా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా కమిటీల నియామకం
పార్వతీపురం రూరల్: జిల్లా వైఎస్సార్‌సీపీ ప్రధాన కమిటీతో పాటు అనుబంధ విభాగాల బాధ్యులను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిగాయి. రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శిగా తాడేల మన్మథనాయుడు (కురుపాం), జిల్లా అధికార ప్రతినిధిగా గంగుల నాగేశ్వరరావు నియమితులయ్యారు.అలాగే ఇతర అనుబంధ విభాగాల నుంచి జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడిగా యామల అజయ్ (పార్వతీపురం), జిల్లా ప్రచార విభాగం ఉపాధ్యక్షుడిగా శివ్లంకి చిరంజీవి (పార్వతీపురం), జిల్లా యువజన విభాగం కార్యవర్గ సభ్యుడిగా కోట సతీష్ కుమార్ (పార్వతీపురం) ఎంపికయ్యారు. జిల్లా బీసీ సెల్ కార్యవర్గ సభ్యులుగా కురుపాం నియోజకవర్గానికి చెందిన గొర్రెల రవీంద్ర, కందిస వంశీకృష్ణలను నియమించారు.
ఎన్టీఆర్‌కు నివాళులు
పార్వతీపురం: మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్‌టీ రామారావు జయంతిని కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, డీఆర్వో కె.హేమలత పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగుజాతి గౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన మహానేతగా ఎన్టీఆర్ సేవలను కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సంతకవిటి: మండలంలోని రంగారాయపురం వద్ద ఉన్న నారాయణపురం ఆనకట్ట నుంచి కుడి, ఎడమ ప్రధాన కాలువలకు సాగునీటి మళ్లింపునకు వీలుగా షట్టర్లు ఏర్పాటుచేస్తున్న ట్టు డీఈ వై.రవీంద్రనాయుడు గురువారం తెలిపారు. విజయనగరం జిల్లా సంతకవిటి, శ్రీకాకుళం జిల్లా పొందూరు, ఆమదాలవలస, ఎచ్చెర్ల, బూర్జ మండలాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు వీలు గా 118 షట్టర్లలో పూర్తిగా పాడైన 33 షట్టర్లను తొలగించి కొత్తవి ఏర్పాటుచేస్తున్నామన్నారు.


