● తీర్మానం, బహిరంగ వేలం లేకుండానే తరలింపు
● మూడడ్ల వలస ప్రాథమిక పాఠశాలలో ఘటన
పార్వతీపురం రూరల్: మండలంలోని సూడిగాం పంచాయతీ మూడడ్ల వలస మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఈదురుగాలులకు నేలకూలిన భారీ నీలగిరి వృక్షాలను నిబంధనలకు విరుద్ధంగా తరలించే యత్నం జరిగింది. విద్యాశాఖకు ఎలాంటి రాతపూర్వక సమాచారం ఇవ్వకుండా, పాఠశాల కమిటీ తీర్మానం, బహిరంగ వేలం లేకుండానే గురువారం కొందరు కలప వ్యాపారులు యంత్రాలతో చెట్లను కోసి తరలించే ప్రయత్నం చేశారు. ఇందులో స్కూల్ కమిటీ ప్రమేయం ఉందనే ఆరోపణలున్నాయి. గతంలో అడారు పాఠశాలలో జరిగిన టేకు చెట్ల నరికివేత తరహాలోనే ఈ ఘటన జరిగింది. దీనిపై ఎంఈఓ స్పందిస్తూ.. చెట్లు కూలిన విషయం ప్రధానోపాధ్యాయుడు తన దృష్టికి తెచ్చారని, అయితే తీర్మానం చేసి వేలం ద్వారానే విక్రయించాల్సి ఉంటుందని తెలిపారు. తాను వేసవి క్యాంపులో ఉన్నానని, విక్రయానికి ఎలాంటి తీర్మానం చేయలేదని, కేవలం కమిటీ దృష్టికి మాత్రమే తీసుకెళ్లానని హెచ్‌ఎం వివరించారు. కాగా, పాఠశాలల్లో చెట్లు నేలకూలితే నిబంధనల ప్రకారం బహిరంగ వేలం వేయాలని, ఇష్టానుసారం వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఎంపీపీ శోభారాణి స్పష్టం చేశారు.


