వీరఘట్టం: మండలంలోని నడిమికెల్ల గ్రామంలో ఇసుక మాఫియా నడుస్తోంది. గ్రామంలో ఎక్కడ చూసినా ఇసుక కుప్పలు కుప్పలుగా కనిపిస్తోంది. సమీపంలో ఉన్న నాగావళి నది నుంచి ఇసుకను అక్రమంగా తీసుకువచ్చి తమకు అనుకూలంగా ఉన్నచోట డంప్ చేస్తున్నారు. డిమాండ్ మేరకు ఇసుకను లారీలు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ డబ్బులు ఆర్జిస్తున్నారు. గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు ఇసుకదందా సాగిస్తూ రూ.కోట్లు ఆర్జించినట్లు స్థానికులు చెబుతున్నారు. దందా అంతా పోలీసులకు, రెవెన్యూ అధికారులకు తెలిసే జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఇసుక దందా జరుగుతున్నా మైనింగ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కలెక్టర్ స్పందించడంతో...
ఇటీవల సీఎస్పీ రోడ్డులో నడిమికెల్ల–కడకెల్ల మధ్యలో రోడ్డు పక్కన 30 ట్రాక్టర్ల ఇసుకను ముగ్గురు వ్యక్తులు డంప్‌చేశారు. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంచేశారు. వారం రోజుల కిందట అటుగా వెళ్తున్న కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఇసుక కుప్పలను చూసి ఎందుకు ఇంత పెద్దమొత్తంలో ఇసుక పోగులు ఉన్నట్టు ఆరా తీశారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇసుక అక్రమ వ్యాపారం సాగిస్తున్నట్టు తెలుసుకుని వెంటనే సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
వామ్మో ఇన్ని పోగులా..
నడిమికెల్ల గ్రామంలో ఊరంతా ఇసుక పోగులు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శనివారం తహసీల్దార్ ఎ.ఎస్.కామేశ్వరరావు, ఎస్‌ఐ ఎస్.షణ్ముఖరావు గ్రామంలో పర్యటించారు. వివిధ ప్రాంతాల్లో నిల్వచేసిన ఇసుక పోగులను పరిశీలించి ఆశ్చర్యపోయారు. వీఆర్వో, వీఆర్‌ఏపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుకను డంప్‌చేసిన వ్యక్తుల వివరాలపై ఆరా తీశారు. ఇసుక తవ్వకాలు, తరలింపునకు వినియోగిస్తున్న జేసీబీలు, ట్రాక్టర్ల వివరాలు సేకరించాలని వీఆర్వోను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ నడిమికెల్ల గ్రామం చుట్టూ 150 ట్రాక్టర్ల ఇసుక నిల్వ చేసినట్టు గుర్తించామన్నారు. ,గ్రామంలో ఉన్న 15 ట్రాక్టర్ల వివరాలు సేకరంచి పోలీసులకు పంపించామన్నారు. ఇసుకను మైనింగ్ అధికారులకు అప్పగిస్తామని తహసీల్దార్ తెలిపారు. అయితే, ఇసుక మాఫియాను విడిచిపెట్టాలంటూ స్థానిక అధికారపార్టీ నేతల నుంచి అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. గ్రామస్తులు మాత్రం నదిని గుల్లచేస్తున్న ఇసుక అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఊరంతా ఎక్కడిపడితే అక్కడ ఇసుక
డంపింగ్
డిమాండ్ పెరిగినప్పుడు అమ్మకాలు
ఇసుక కుప్పలను పరిశీలించి సీజ్ చేసిన అధికారులు


