జలధార పనుల్లో జాప్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

జలధార పనుల్లో జాప్యం వద్దు

May 21 2026 12:38 AM | Updated on May 21 2026 12:38 AM

నేటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

పార్వతీపురం: జిల్లాలో జరుగుతున్న జలధార–జలహారతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పనుల తీరుపై అధికారులతో బుధవారం సమీక్షించారు. ఇప్పటికే మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలని, ప్రారంభంకాని పనులను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పూర్తి అయిన పనుల వివరాలను ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. జలధార పనులను ఎంపీడీఓలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో జేసీ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్లు ఆర్‌.వైశాలి, పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఎఫ్‌ఓ జీఏపీ ప్రసూన, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి కోసం ఆండ్ర జలాశయం నీరు విడుదల

చంపావతి నదీతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

మెంటాడ: విజయనగరం మున్సిపాలిటీకి తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆండ్ర జలాశయం నుంచి చంపావతి నదిలోకి 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్టు ఇరిగేషన్‌ శాఖ అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. చంపావతి నదిలో ఉన్న నెలిమర్ల (3), రామతీర్థాలు (3), కుదిపి (3) వద్ద గల మొత్తం తొమ్మిది పంపు హౌస్‌ల వద్ద నీటి మట్టం పెంచడం కోసం ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నీటి విడుదల మే 21 నుంచి జూన్‌ 6 వరకు కొనసాగుతుందన్నారు.. నదిలో నీటి ప్రవాహం పెరగనున్నందున చంపావతి నది తీర ప్రాంత మండలాలు, గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హాజరు కానున్న 4,733 మంది విద్యార్థులు

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు జూన్‌ 2 వరకు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,733 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 2,578 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్‌ విద్యార్థులు 1,340 మంది, ఒకేషనల్‌ మొదటి ఏడాది విద్యార్థులు 392 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 423 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 16 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు, లైవ్‌ స్ట్రీమింగ్‌ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

కన్వీనర్‌గా డీఐఈఓ నాగేశ్వరరావు

జిల్లా పరీక్షల కమిటీ కన్వీనర్‌గా డీఐఈఓ వై.నాగేశ్వరరావు వ్యవహరిస్తుండగా.. సభ్యులుగా చినమేరంగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.రమణ, పాలకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల బాలుర విభాగం ప్రిన్సిపాల్‌ వి.హరగోపాల్‌, పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల బోటనీ అధ్యాపకులు ఎ.రాజు విధులు నిర్వహించనున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్‌, రెవెన్యూ, విద్యాశాఖ, పోస్టల్‌, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షల నిర్వహణలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, సిట్టింగ్‌ స్క్వాడ్లు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఐటీడీఏలో హెల్పర్‌ పోస్టులకు ఇంటర్వ్యూ

పార్వతీపురం రూరల్‌: పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న హెల్పర్‌ పోస్టుల భర్తీకి బుధవారం ఐటీడీఏ కార్యాలయంలో పీఓ ఆర్‌.వైశాలి పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఐటీడీఏ పరిధిలోని 8 మండలాల్లో 175 హెల్పర్‌ పోస్టుల భర్తీకి గతంలో నోటిఫికేషన్‌ జారీ చేయగా, మొదటి విడతగా 122 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న 296 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. అర్హత, ప్రతిభ ఆధారంగా పారదర్శక పద్ధతిలో ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ డాక్టర్‌ టి.కనకదుర్గ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement