● ఆరోగ్య కళావేదిక తొలగింపునకు టీడీపీ నేత ఒత్తిడి!
● కలెక్టర్‌కు వ్యతిరేకంగా చర్యలు
సాక్షి, పార్వతీపురం మన్యం: కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా.. అందుకు తాము వ్యతిరేకమే అని జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు తెగేసి చెబుతున్నారు. ఆయన చేపడుతున్న పనులకు అడ్డు పడటమే తమ ప్రధాన కర్తవ్యం అన్నట్లుగా ముందుకు వెళ్తున్నారు. కలెక్టర్‌ను మార్చాలని ఉన్నత స్థాయిలో చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో ఆయనను మానసికంగా దెబ్బకొట్టేందుకు అన్నిదారులూ వెతుకుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగా, సామాజిక వర్గాన్ని ప్రస్తావిస్తూ, సోషల్ మీడియాలో పెయిడ్ ప్రచారం ఓ వైపు చేస్తూనే.. జిల్లాలో తలపెట్టిన కార్యక్రమాలను రద్దు చేయాలని అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే గత నెల 4వ తేదీన జిల్లా ఆస్పత్రిలో వినూత్నంగా ‘మన్యం ఆరోగ్య కళా వేదిక’కు కలెక్టర్ శ్రీకారం చుట్టగా.. ఆ వేదికను శాశ్వతంగా తొలగించాలని ఓ ప్రజాప్రతినిధి పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది.
రోగులకు ఆహ్లాదాన్ని పంచే ఉద్దేశంతో కళావేదిక..
ఆస్పత్రి అంటే కేవలం మందులు, రోగుల మూలుగులే కాదు.. మానసిక ఉల్లాసం కూడా అవసరమని... రోగుల్లో ఉన్న ఒత్తిడిని తగ్గించి, వారిలో ఉత్సాహాన్ని నింపేందుకు ఆస్పత్రి ప్రాంగణంలో ప్రతి సాయంత్రం ప్రదర్శనలు ఇచ్చేలా ‘మన్యం ఆరోగ్య కళా వేదిక’ను గత నెల 4న కలెక్టర్ ఘనంగా ప్రారంభించారు. ఆస్పత్రి సిబ్బంది ఆలోచనలతో ఈ కార్యక్రమం పురుడు పోసుకుంది. దిగులుగా ఉండే ఆస్పత్రి వాతావరణం నుంచి రోగులను, వారి సహాయకులను బయటపడేయడమే ఈ వేదిక ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో మెడిటేషన్ (ధ్యానం) చేసుకోవడానికి, నవ్వుకోవడానికి వీలుగా వీడియో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని ప్రకటించారు. ఎక్కడాలేని వినూత్న కార్యక్రమానికి జిల్లా ఆస్పత్రి వేదిక కావడంపై హర్షించాల్సింది పోయి.. కలెక్టర్ మీద అక్కసుతో ఆ వేదికను మొత్తంగా తొలగించాలని ఆస్పత్రి సిబ్బంది మీద ఆ ప్రజా ప్రతినిధి తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. ఇప్పటికే మెగా కోలాటానికి బ్రేక్ వేసి, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన ప్రజా ప్రతినిధులే.. ఈసారి కళా వేదికపై పడ్డారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా బాస్‌కు వ్యతిరేకంగా వెళ్లలేక.. ప్రజా ప్రతినిధుల ఒత్తిడి భరించలేక అధికారులు నలిగిపోతున్నారు. స్వయంగా ప్రభుత్వం నియమించిన ఒక కలెక్టర్ ను తొలగించేందుకు.. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే వ్యతిరేకంగా పనిచేయడం, చేయించడం బహుశా రాష్ట్ర చరిత్రలోనే ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి.


