చురుగ్గా జనగణన | - | Sakshi
Sakshi News home page

చురుగ్గా జనగణన

May 21 2026 12:38 AM | Updated on May 21 2026 12:38 AM

అత్యధిక శాతం గృహాల, జనాభా నమోదు ప్రక్రియ పూర్తి

3,31,846 ఇళ్లలో పూర్తి

9,08,227 మంది ప్రజల వివరాల నమోదు

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో జనాభాగణన–2027 కార్యక్రమంలో భాగంగా మే 1వ తేదీ నుంచి ప్రారంభమైన గృహ గణన ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,136 హౌస్‌ లిస్టింగ్‌ బ్లాక్‌లు ఉండగా.. ఇప్పటివరకు 1,834 బ్లాక్‌లలో గృహగణన పూర్తయ్యింది. మిగిలిన బ్లాక్‌లలో కూడా ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. మొత్తం 3,45,608 గృహాలకు గాను, ఇప్పటివరకు 3,31,846 ఇళ్లలో గణన పూర్తయింది. మొత్తం 10,38,857 జనాభా వివరాలను సేకరించాల్సి ఉండగా.. ఇప్పటివరకు 9,08,227 మంది ప్రజల వివరాలను ఎన్యూమరేటర్లు నమోదు చేశారు.

క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు

గణన ప్రక్రియ వేగవంతంగా సాగుతున్నా క్షేత్ర స్థాయిలో సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని వివరాలు చెప్పేందుకు ప్రజలు నిరాకరిస్తున్నారు. సొంత ఇల్లు, కారు, వాహనాలు, ఉద్యోగం వంటి వివరాల్లో కొంతమంది తప్పుడు సమాచారం ఇస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు. వాస్తవాలు చెబితే భవిష్యత్తులో పథకాలు, ఇతర లబ్ధి విషయంలో అన్యాయం అయిపోతామెమో అని చాలామంది అపోహ పడుతున్నారు.

ఈ గృహ గణన ప్రక్రియలో ఏ ఒక్కరూ విస్మరించకూడదనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తమ ప్రాంతంలో ఇంకా గృహ గణన జరగలేదని భావించినా, లేదా ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు సేకరించలేదని ప్రజలు గుర్తిస్తే వెంటనే జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ను 08963–796085 సంప్రదించవచ్చు. అత్యధిక శాతం గృహాల, జనాభా నమోదు ప్రక్రియ ఇప్పటికే విజయవంతంగా పూర్తయింది. గణన ప్రక్రియ సజావుగా సాగేలా ప్రజలు సహకరించాలి.

– ఎన్‌. ప్రభాకర రెడ్డి, కలెక్టర్‌, ప్రిన్సిపాల్‌ సెన్సెస్‌ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement