ఆందోళనలో అయ్యవార్లు! | - | Sakshi
Sakshi News home page

ఆందోళనలో అయ్యవార్లు!

May 21 2026 12:38 AM | Updated on May 21 2026 12:38 AM

ఆందోళనలో అయ్యవార్లు!

రామభద్రపురం: రానున్న విద్యా సంవత్పరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలపై అయ్యవార్లు ఆందోళన చెందుతున్నారు. విద్యా శాఖ ఆదేశాల మేరకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేటు పాఠశాలల మాదిరిగా గ్రామాల్లో గల్లీగల్లీకి తిరుగుతూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులను కోరుతున్నారు. మీ పిల్లల బాధ్యత మాదేనని, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్కులు, యూనిఫాంతో పాటు నాణ్యమైన విద్య అందిస్తామని, ఏఐ ద్వారా బోధిస్తామని హామీ ఇస్తున్నారు. తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా టీచర్లు పదేపదే వెళ్లి తల్లిదండ్రులను బతిమలాడవలసిన పరిస్థితి ఉందని, గతంలో ఏనాడూ ఇంత దారుణం లేదని విద్యావేత్తల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేయడంతో పాటు టీచర్లకు బోధనేతర పనులు అప్పజెప్పడంతో తరగతి గదులలో విద్యాబోధన పూర్తిగా కుంటుపడింది. దాంతో తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతుందన్న నమ్మకం పోయింది. తమ పిల్లలను ప్రైవేటు బడుల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతుండడంతో పిల్లల చేరికల కోసం టీచర్లు నానా పాట్లు పడాల్సిన దుస్థితి నెలకొంది.

సమస్యలు.. కారణాలు..

గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్పొరేట్‌ వ్యవస్థను తలదన్నేలా సంస్కరణలు తీసుకొచ్చి సర్కారు బడులను అభివృద్ధి చేశారు. పేద విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియం, సబ్జెక్టుకు ఒక టీచర్‌ చొప్పున్న నియామకం, ట్యాబ్‌లలో, ఐఎఫ్‌బీ ప్యానెల్స్‌ ద్వారా విద్యాబోధన జరిగింది. తరగతి గదులలో ఆహ్లాదకరమైన బల్లలు, టేబుళ్లతో పాటు ఫ్యాన్లు, లైట్ల మధ్య విద్యాబోధన జరిగింది. ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి శుద్ధజలం అందించారు. నాణ్యమైన పౌష్టికాహారం, జగనన్న విద్యాకానుక కిట్లు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే విద్యా సంస్కరణలు తిరోగమనం పట్టాయి. ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో సతమతమవుతున్నాయి. నాడు–నేడులో నిర్మాణ దశలో ఉన్న భవనాలకు నిధులు లేక వెలవెలబోతున్నాయి. అదనపు తరగతి గదుల అసంపూర్తి నిర్మాణం దిష్టిబొమ్మల్ని తలపిస్తున్నాయి. పాఠశాలల్లో పాడైపోయిన ఆర్వో ప్లాంట్‌లను బాగుచేసే దిక్కులేక విద్యార్థులు తాగునీటికి ఇబ్బందిపడే దుస్థితి ఉంది. పలువురుకు తల్లికి వందనం అందని పరిస్థితి ఉందని ఆయా తల్లిదండ్రులు చెబుతున్నారు. మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు ఇచ్చే విద్యాకానుక కిట్లలో నాణ్యత కొరవడింది. ఉపాధ్యాయులు పూర్తిగా బోధనేతర పనులకు పరిమితం కావడం, ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఒకటి నుంచి 5వ తరగగతి వరకు అన్ని సబ్జెక్టులు ఒకే ఉపాధ్యాయుడు బోధన వంటి కారణాలతో ఇంటి పక్కనే సర్కారు బడి ఉన్నా అందులో తమ పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు సాహసించడం లేదు.

ప్రభుత్వ బడుల్లో చేరికలకు ముమ్మర ప్రచారం

ఇంటింటికీ వెళ్లి ఆకట్టుకునే ప్రయత్నాలు

ప్రభుత్వ పాఠశాలలను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు

బోధనేతర పనులతో కుంటుపడుతున్న విద్యా బోధన

ప్రైవేటును ఆశ్రయిస్తున్న తల్లిదండ్రులు

ఏటా దిగజారుతున్న విద్యార్థుల సంఖ్య

ప్రభుత్వ విధానలే కారణమంటున్న

ఉపాధ్యాయ సంఘాలు

ఏటా దిగజారుతున్న విద్యార్థుల సంఖ్య

చంద్రబాబు సర్కారు విద్యార్థులకు ఉపయోగపడని విద్యా సంస్కరణలు అమలు చేయడంతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తూ పరోక్షంగా కార్పొరేట్‌ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తుందన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. దాంతో గత రెండేళ్ల నుంచి ఏడాదికేడాది విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 1766 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వీటిలో 2024–25 విద్యా సంవత్సరంలో సుమారు 1.17 లక్షల మంది విద్యార్థులు చేరగా 2025–26లో 1,14,350 మంది మాత్రమే చేరారు. దాదాపు 3 వేల మంది వరకు చేరికలు పడిపోయాయి. దీంతో ఈ ఏడాది చేరికలపై టీచర్లలో ఆందోళన నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement