విజయనగరం: బెంగళూరు వేదికగా జూన్ 8 నుంచి 12 వరకు జరగనున్న జాతీయ స్థాయి పారా స్విమ్మింగ్ (ఈత) పోటీలకు పార్వతీపురానికి చెందిన పారా స్విమ్మర్ ప్రియాంకదాస్ ఎంపికై ందని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ మేరకు ఆమెను అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న కాకినాడలో జరిగిన 8వ రాష్ట్ర జూనియర్, సబ్ జూనియర్ పారా స్విమ్మింగ్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు హాజరు కాగా ప్రియాంకదాస్ తన ప్రతిభతో గోల్డ్ మెడల్ సాధించడంతో జాతీయ పోటీలకు ఎంపికై ందని తెలిపారు. జాతీయ స్థాయి పోటీల్లో రాణించి సత్తా చాటాలని ఆకాంక్షించారు.
30 ట్రాక్టర్ల ఇసుక సీజ్
వీరఘట్టం: మండలంలో ఇసుక అక్రమ వ్యాపారం జోరుగా సాగుతోంది. నాగావళి నదీతీర ప్రాంతాలైన కడకెల్ల, నడిమికెల్ల, విక్రమపురం, గడగమ్మ, పాలమెట్ట, బిటివాడ, ఎం.వి.పురం గ్రామాల నుంచి నిత్యం ట్రాక్టర్లతో అక్రమ ఇసుక తరలిస్తూ కొందరు కాసులు దండుకుంటున్నారు. అయితే నడిమికెల్లకు చెందిన ముగ్గురు వ్యక్తులు సీఎస్‌పీ రోడ్డులో నడిమికెల్ల–కడకెల్ల మధ్యలో రోడ్డు పక్కనే సుమారు 30 ట్రాక్టర్లు ఇసుకను డంపింగ్ చేసి ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే వీఆర్‌ఓ కీర్తిసుధ రెండు రోజుల క్రితం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఇసుకను సీజ్ చేశారు. ఆ ముగ్గురు వ్యక్తులపై వాల్టా చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి కలెక్టర్‌కు తెలియజేసినట్టు తహసీల్దార్ ఏఎస్.కామేశ్వరావు బుధవారం తెలిపారు. నాగావళి నదీ తీరంలో తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని, ఇసుక అక్రమంగా తరలించే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేస్తామన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నిర్వహిస్తున్న మాదకద్రవ్య విముక్తి కేంద్రం (డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్) లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ బుధవారం తెలిపారు. వైద్యుడు–1, ప్రాజెక్టు కో ఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ –1, సోషల్ వర్కర్–1, పీర్ ఎడ్యుకేటర్–1, వార్డు బాయ్ –1, యోగా థెరపిస్ట్ –1, చౌకిదార్ – 2, హౌస్ కీపింగ్ సిబ్బంది ఒక పోస్టుకు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు విజయనగరం.ఏపీ.జిఓవి.ఇన్ సంప్రదించాలని సూచించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
పెందుర్తి : బతుకు తెరువు కోసం విశాఖ వచ్చి చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న అతన్ని విధి చిన్నచూపు చూసింది. రోడ్డు ప్రమాదం రూపంలో అతన్ని బలి తీసుకుంది. కుటుబంలో తీరని విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం జిల్లా కల్లెంపూడికి చెందిన బొమ్మిడి మురళి (27) భార్య వెంకటలక్ష్మి, కొడుకు హిమాంత్(3)తో కలిసి విశాఖలోని చినముషిడివాడ పాత ఊరులో నివాసం ఉంటున్నాడు. బిగ్ బాస్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం డెలివరీ తీసుకొని చినముషిడివాడ నుంచి పెందుర్తి వైపు బీఆర్‌టీఎస్ మధ్య రోడ్డులో బైకుపై వెళ్తున్నాడు. ముందు ఉన్న ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోతుండగా ఎదురుగా కారు రావడంతో గందరగోళానికి గురై అదుపు తప్పి కింద పడిపోయాడు.
ఆర్టీసీ బస్సు వెనుకచక్రాలు మురళి తలపై నుంచి వెళ్లిపోవడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు.


