విజయనగరం అర్బన్ : ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని ఎన్‌ఎంయూ జోనల్ కార్యదర్శి బి.ఎస్.రాములు హెచ్చరించారు. నాటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ప్రైవేట్ బస్సులను రద్దు చేసి ఆర్టీసీ జాతీయికరణ ద్వారా వేలాది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని గుర్తు చేశారు. అయితే నేటి ప్రభుత్వం ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరణ చేయాలని యోచిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నప్పటికీ విద్యుత్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీని వల్ల భవిష్యత్తులో ఆర్టీసీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఆర్టీసీని కేవలం చరిత్ర పాఠాల్లో మాత్రమే చదవాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆర్టీసీలో సుమారు 50 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రైవేటీకరణ వల్ల వారి జీవితాల్లో అస్థిరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీలోని అన్ని బస్సులను ఏసీ బస్సులుగా మార్చి, వాటి నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తామని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు స్పష్టంగా చెప్పడం శోచనీయమన్నారు. ఎన్‌ఎంయూ తరఫున ముఖ్యమంత్రి, ఎండీకి 15 డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశామని తెలిపారు. ప్రభుత్వం విధానం స్పష్టమైందని, అందుకే ఇకపై ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సీ్త్రశక్తి పథకానికి విశేష ఆదరణ లభిస్తున్నప్పటికీ, బస్సుల సంఖ్యను, ఉద్యోగుల సంఖ్యను పెంచడం లేదని విమర్శించారు. సిబ్బంది కొరత కారణంగా ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురై, కొందరు విధుల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పే కమిటీని వెంటనే ఏర్పాటు చేసి, అంతవరకు ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పీజే రాఫెల్, జిల్లా అధ్యక్షుడు దుర్గారాజు, డిపో అధ్యక్షుడు కేఎస్‌ఆర్ రాజు, సహాయ కార్యదర్శులు కేబీ రాజు, యు.సంజీవరావు, రాష్ట్ర కార్యదర్శి ఎం.సుజాత తదితరులు పాల్గొన్నారు.


