పార్వతీపురం రూరల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వివిధ పోలీస్‌స్టేషన్ల దర్యాప్తు అధికారులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దర్యాప్తులో ఉన్న రోడ్డు ప్రమాద కేసుల పురోగతిపై సమీక్షించారు. ప్రమాదాలకు ప్రధాన కారణాలైన అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ‘బ్లాక్ స్పాట్’లను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, డ్రోన్ల సహాయంతో అక్కడి ఇంజినీరింగ్ లోపాలను గుర్తించి సరి చేయాలన్నారు. మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించేలా తుప్పలను తొలగించాలని, అవసరమైన చోట్ల హెచ్చరిక బోర్డులు, సర్వీస్ రోడ్లపై స్పీడ్ బ్రేకర్లు, ప్రధాన రహదారులపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు జిగ్–జాగ్ స్టాపర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో ప్రమాదాల నివారణకు ‘ఫేస్ వాష్ అండ్ గో’ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు హెల్మెట్, సీట్ బెల్ట్ ధారణ, డ్రంక్ అండ్ డ్రైవ్‌లపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీషా రెడ్డి, పాలకొండ డీఎస్పీ రాంబాబు, సీఐ సుధాకర్, సోషల్ మీడియా సీఐ శ్రీనివాసరావు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.


