● ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవిమాధవి
విజయనగరం ఫోర్ట్: అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సకాలంలో వైద్య సేవలు అందించాలని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దేవిమాధవి అన్నారు. స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏపీఎస్‌పీ కమాండెంట్ వారి ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న 191 మంది స్టైఫండరీ కాడిట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్ శిక్షణార్ధులకు అత్యవసర వైద్య సేవలపై నిర్వహించిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రమాదాలు, గుండెపోటు, మునిగిపోవడం, శ్వాస ఆడకపోవడం వంటి అత్యవసర పరిస్థితులను ఎదురుయ్యే అవకాశం ఉన్నందున అలాంటి సందర్భాల్లో తక్షణ వైద్య సహాయం అందించగల నైపుణ్యాలను పెంపొందించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. బేసిక్ లైఫ్ సపోర్ట్, అత్యవసర చికిత్స విధానాలు, గాయపడిన వ్యక్తులకు ప్రాధమిక చికిత్స అందించే పద్ధతులు, గుండెపోటు వచ్చినప్పుడు చేపట్టాల్సిన చర్యలు, శ్వాస ఆడకపోతే చేపట్టాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తదితరులు పాల్గొన్నారు.


