● ఇన్‌చార్జ్ కలెక్టర్ సేతుమాధవన్
విజయనగరం ఫోర్ట్: జల్ జీవన్ మిషన్ 2.0 పనుల కార్యచరణకు సిద్ధం కావాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎన్.సేతుమాధవన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జల్ జీవన్ మిషన్ 2.0 కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 2028 వరకు పొడిగించిందన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించేందుకు అవసరమైన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రుపొందించాలన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమాన్ని 2027 వరకు పొడిగించిందన్నారు. ఓడీఎస్ ప్లస్ కార్యక్రమం ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డిని, అవసరమైన చోట సామూహిక మరుగుదొడ్డిని నిర్మించాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలన్నారు. సమగ్ర, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వాహణను పట్టిష్టంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


