సాక్షి, పార్వతీపురం మన్యం :
అంగన్‌వాడీ సరుకులనే కాదు.. కార్యకర్త, సహాయకురాళ్ల పోస్టులనూ ‘కాంట్రాక్టరు’కే అప్పగించేశారు. కాకుంటే.. ఈ పోస్టుల విషయంలో అధికార పార్టీకి చెందిన నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తారు. రూ.4 నుంచి రూ.8 లక్షల వరకు ఒక్కో పోస్టుకు రేటు కట్టేశారు. గతంలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీ సమయంలో రూ.లక్షల్లో వసూలు చేసిన అధికార పార్టీ నేతలు.. ఆ అనుభవంతో మరింతగా బేరసారాలకు దిగుతున్నారు. ఐసీడీఎస్ అధికారులు సైతం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎవరైనా పోస్టు కోసం తెలిసిన వారి ద్వారా సలహా అడిగితే.. నిర్మొహమాటంగా ఎమ్మెల్యే నుంచి సిఫారసు లేఖ తెచ్చుకోవాలని ‘సిఫారసు’ చేస్తున్నారు. పేరుకే పారదర్శకమంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 263 అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి గత నెల 23న నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 14వ తేదీలోపు దరఖాస్తుల స్వీకరణకు గడువిచ్చారు. వందల సంఖ్యలో అభ్యర్థులు ఆశతో దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది నాయకులు, దళారులు అంగన్‌వాడీ ఉద్యోగాలిప్పిస్తామంటూ ఆశావహులను మభ్యపెడుతున్నారు. పోస్టులు ఇప్పటికే ఫిక్స్ అయిపోయాయని.. ఇంటర్వ్యూలు నామమాత్రమేనన్న ప్రచారం ఉంది.
పారదర్శకమా.. ఒట్టిమాటే!
గతంలో చేపట్టిన అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తమ వద్ద రూ.3 లక్షలు తీసుకుని, రూ.5 లక్షలు ఇచ్చిన మరొకరికి పోస్టులు ఇచ్చేశారని స్వయంగా పీజీఆర్‌ఎస్‌లోనూ కొంతమంది ఫిర్యాదు చేశారు. అన్ని అర్హతలూ ఉన్న వారిని పక్కనపెట్టి స్థానికేతరులకు ప్రాధాన్యమిచ్చారని పలువురు ఆరోపించారు.
● ఇటీవల చేపట్టిన కేజీబీవీ నియామకాల్లోనూ పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్టు సమాచారం.
● ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకూ రూ.7 లక్షలు చొప్పున వసూలు చేశారని.. అంతకుముందు తాము రూ.3 లక్షలిచ్చినా పోస్టు ఇవ్వలేదని టీడీపీకి చెందిన వారే విమర్శలు చేశారు.
ఆర్‌డబ్ల్యూఎస్ పోస్టులపైనా కన్ను!
జిల్లాలోని గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగంలో స్వచ్ఛ భారత్ మిషన్– గ్రామీణ కింద పలు కాంట్రాక్టు పోస్టుల భర్తీకి ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి సయ్యద్ అబ్దుల్ రజాక్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. నిర్వహణ సమచార వ్యవస్థలో, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ విభాగంతోపాటు, అకౌంటెంట్/డేటా ఎంట్రీ విభాగంలో ఒక్కో పోస్టు చొప్పున భర్తీ చేయనున్నారు. వాస్తవానికి ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ ప్రజాప్రతినిధుల వద్దకు ఫైలు వెళ్లిందని సమాచారం. పేరుకు ప్రకటనైతే ఇచ్చారు గానీ.. ఈ పోస్టులకు బేరం కూడా అయిపోయిందని తెలుస్తోంది.
అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల నియామకాలను ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, నిబంధనలు, మెరిట్ ఆధారంగా పూర్తి పారదర్శకతతో నిర్వహిస్తున్నాం. నియామకాల విషయంలో ఎటువంటి మధ్యవర్తిత్వమూ లేదు. కొంతమంది వ్యక్తులు అభ్యర్థులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. అలాంటి వారి మాటలు నమ్మవద్దు.
– కనకదుర్గ, పథక అధికారి, ఐసీడీఎస్
పేరుకే పారదర్శకత.. ‘పేర్లు’ చెప్పినవారికే పోస్టులు
రూ.లక్షల్లో బేరసారాలు
కొలువులపై పచ్చ నేతల కన్ను
అర్హత కాదు.. సిఫారసు లేఖలే ప్రామాణికం


