త్వరలో గ్రీవెన్స్ వింగ్
అన్ని విభాగాల్లో పార్టీ కమిటీల
నియామకం పూర్తి చేయాలి
ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలి
జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు
పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం
విజయనగరం:
అధికారంలో ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల పక్షాన నిలబడే వైఎస్సార్‌సీపీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రింగ్‌రోడ్డులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్సార్‌సీపీకి అన్ని విభాగాల్లో కమిటీల నియామకాలను పూర్తి చేయాలని ఆదేశించారు. కమిటీల్లో ఉండే వారు పార్టీ కోసం కష్టపడి పనిచేసేలా చూసుకోవాలన్నారు. తద్వారా పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని చెప్పారు.
అన్ని విభాగాలు చురుకై న పాత్ర పోషించాలి
మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు చేయని వైనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రధానంగా మహిళలకు ఇచ్చిన ఆడబిడ్డనిధి కింద ప్రతి నెలా ఇస్తామన్న రూ.1500 పథకం అమలు కావడం లేదని, సున్నవడ్డీ రుణాలు మంజూరు చేయటం లేదని చెప్పారు. మహిళలకు జరుగుతున్న అన్యాయంపై పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. పార్టీ మహిళా విభాగంతో యువజన, విద్యార్థి, ఎస్సీ, సోషల్ మీడియా విభాగాలు రానున్న రోజుల్లో చురుకై న పాత్ర పోషించి పార్టీని విజయపథంలో నడిపించాలన్నారు. ప్రతి అనుంబధ విభాగ అధ్యక్షుడు ఆయా విభాగాలకు చెందిన నియోజకవర్గ నాయకులతో నిత్యం సమీక్షలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
బీఎల్‌ఏల నియామకాలు పూర్తి చేయాలి
రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే బూత్ లెవెల్ ఏజెంట్‌ల నియామక ప్రక్రియను జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో వచ్చేనెల 5వ తేదీలోగా పూర్తి చేయాలని మజ్జి శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల సంఘం ప్రస్తుతం ‘సర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా రూపకల్పనలో బీఎల్‌ఏలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. బీఎల్‌ఏల నియామక ప్రక్రియ పూర్తియితే వారికి సర్ కార్యక్రమంపై నియోజకవర్గాల వారీగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ప్రజలకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదని జెడ్పీ చైర్మన్ ఆరోపించారు. వివిద వర్గాల సమస్యలను తెలుసుకునేందుకు పార్టీ పరంగా త్వరలో గ్రీవెన్స్ వింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు వర్రి నర్సింహమూర్తి, గొర్లె రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి కె.వి. సూర్యనారాయణరాజు, వివిధ విభాగాల అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస్, పీరుబండి జైహింద్‌కుమార్, గదుల సత్యలత, పతివాడ కృష్ణవేణి, బూర్లె నరేష్, తదితరులు పాల్గొన్నారు.


