సాలూరు: దేశంలోనే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా ఉండడంతో అన్నివర్గాల ప్రజలను కలవరపెడుతోంది. అ‘ధన’పు భారం మోయలేమంటూ ఆందోళన వ్యక్తమవుతోంది. విజయవాడ తర్వాత సాలూరు లారీ పరిశ్రమకు ప్రసిద్ధి. ఇంధన ధరలు అమాంతం పెరగడంతో లారీలు నడిపేందుకు యజమానులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇంధనమే దొరకదన్న ప్రచారం వారిలో అలజడి రేపుతోంది. లారీ పరిశ్రమ ఆధారిత కుటుంబాల జీవనం ప్రశ్నార్థకంగా మారింది. సాలూరులో సుమారు 2 వేలపైగా లారీలు ఉన్నాయి. లారీ డ్రైవర్లు, క్లీనర్లు, గ్రీజ్ బాయ్స్, మెకానిక్‌లు, స్పేర్ పార్ట్‌ల దుకాణాల నిర్వహణతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం డీజిల్ ధరల పెంపు లారీ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేస్తోంది. ఆంధ్రాలోని పెట్రోల్ బంకులలో కేవలం 150 నుంచి 200 లీటర్లు డీజిల్ మాత్రమే పోస్తున్నారని, లారీలు నడిపేందుకు ఇబ్బందులు తప్పడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు.
లారీ చక్రమే జీవనాధారం
లారీ నడిస్తేనే డ్రైవర్, క్లీనర్ కుటుంబాల జీవనం సాఫీగా సాగుతుంది. కుటుంబ అవసరాలు తీరుతాయి. ఇప్పుడు లారీ చక్రం నడవకుంటే జీవన చక్రం ఆగిపోతుందని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. పెంచిన డీజిల్ ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కరోనా సమయంలో గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలతో కార్మికులను ఆదుకుందని, ఇప్పుడు కూడా అదే రీతిన ఆదుకోవాలని కోరుతున్నారు.
అన్ని రంగాలపై ప్రభావం..
దేశంలోని వివిధ ప్రాంతాలకు సరుకులను రవాణాచేసే లారీలు నిలిచిపోతే దాని ప్రభావం చాలా రంగాలపై పడడం ఖాయం. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. పాలకులు చెబుతున్న మాదిరిగా లారీలకు ప్రత్యామ్నాయంలో ఎలక్ట్రికల్ వాహనాలు ఇప్పట్లో వచ్చే అవకాశం కనిపించడంలేదు. లారీ పరిశ్రమ కేవలం వాణిజ్య రంగం కాదు.. వేలాది కుటుంబాల జీవనాధారం. పాలకులు స్పందించి లారీ పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
ఇప్పటికే లారీ పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆంధ్రాలోని బంకులలో కేవలం 200 లీటర్లు డీజిల్ మాత్రమే ఇస్తున్నారు. వీటితో రాయ్‌పూర్ వెళ్లి అక్కడ మరలా గంటల పాటు బంక్‌ల వద్ద నిరీక్షించాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది. చమురు ధరలు పెరుగుతున్నాయి. త్వరలో చమురు నిల్వలు ఉండవన్న వార్తలు సోషల్ మీడియాలో చూస్తున్నాం. ప్రభుత్వం స్పందించి లారీ పరిశ్రమకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి.
– జర్జాపు శ్రీను, లారీల యజమాని, సాలూరు
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో లారీ యజమానుల వర్రీ
లారీలు నడిపేందుకు అ‘ధన’పు ఖర్చు
ఆందోళనలో లారీ పరిశ్రమ ఆధారిత కుటుంబాలు


