● దత్తత గ్రామం పేరిట హడావిడి
● పనులను తమ కాంట్రాక్టరుకు అప్పగించాలని అధికారులపై ఒత్తిడి
● సొంత పార్టీ వారి నుంచే వ్యతిరేకత
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర మంగళవారం బలిజిపేట మండలం పెదపెంకి గ్రామాన్ని పరిశీలించారు. ఆ గ్రామాన్ని తాను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండి.. తన సొంత ప్రాంతంలోని ఓ గ్రామాన్నే ప్రత్యేకంగా ఎందుకు దత్తత తీసుకోవాలి? అనే సందేహం సొంత కార్యకర్తలకే వచ్చింది. గ్రామంలో బోద వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడం... వ్యాధి నిర్మూలన చర్యల్లో భాగంగా వివిధ పనుల కోసం గ్రామానికి నిధులు అధికంగా మంజూరయ్యాయి. అందుకే ఎమ్మెల్యేకు గ్రామంపై ప్రేమపుట్టిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
నిధులు మనకే.. పనులూ మనవారికే!
పెదపెంకి గ్రామంలో బోదవ్యాధి తీవ్రత అధికంగా ఉంది. సుమారు 164 మంది వరకు వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఇక్కడ ఇది వరకే ప్రభుత్వ నిధులతో వివిధ పనులు ప్రారంభమయ్యాయి. తొలివిడతలో రూ.3.50 కోట్లు, రెండో విడతలో రూ.6 కోట్లు, మూడో విడతలో మరో రూ.6 కోట్లు మంజూరు చేసేందుకు సిఫారసు చేశారు. గ్రామంలో తాగునీరు, పక్కా కాలువలు, సీసీ రహదారులు నిర్మాణానికి ఈ నిధులు వెచ్చించనున్నారు. గ్రామంలో మురుగునీరు కనిపించకుండా ప్రత్యేకంగా మ్యాజిక్ డ్రైన్లు నిర్మించాలని భావించారు. ఇప్పటికే గ్రామంలో పలు పనులు ప్రారంభం కాగా.. పాత వాటిని రద్దు చేసి, కొత్తగా తమ కాంట్రాక్టరుకు అప్పగించాలని పీఆర్ ఇంజినీరింగ్ అధికారులపై ఎమ్మెల్యే కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీనిని మండలానికే చెందిన కొంతమంది టీడీపీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం పలు పనులను మరలా ప్రారంభించేందుకు ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి.. ప్రతిఘటించేందుకు మండలంలోని కీలక నాయకులు సిద్ధమైనట్లు తెలిసింది. విషయం పార్టీ దృష్టికి వెళ్లడం.. గొడవేమీ చేయవద్దని పై నుంచి వచ్చిన సూచనలతో వారు తమ కార్యాచరణను విరమించుకున్నారు. ఎమ్మెల్యే చేపట్టిన కార్యక్రమానికి సైతం హాజరు కాలేదు. మరోవైపు గొడవ జరుగుతుందేమోనన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే ముందస్తు జాగ్రత్తగా సుమారు 20 మంది పోలీసు సిబ్బందిని వెంటపెట్టుకుని వెళ్లారు. కొన్ని పనులకు ప్రారంభోత్సవాలు చేసి వెనుదిరిగారు. సొంత నియోజకవర్గంలో పర్యటించడానికే ఎమ్మెల్యేకు ధైర్యం చాలడం లేదని.. పోలీసులను వెంటతీసుకుని వెళ్లాల్సి వస్తోందని ‘తమ్ముళ్లే’ సైటెర్లు వేస్తున్నారు. సొంత ప్రయోజనాల కోసం చూపుతున్న శ్రద్ధ.. అభివృద్ధిపై ఎప్పుడు పెడతారోనని విమర్శిస్తున్నారు.


