● వైద్యం కోసం రూ.4.86 లక్షల ఆర్థిక సాయం
వీరఘట్టం: మండలంలోని కంబరవలస గ్రామానికి చెందిన ఈదుబిల్లి వాసుదేవరావు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తలకు తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. వైద్య ఖర్చులకు డబ్బులు లేని పరిస్థితిలో గ్రామస్తులు ఉదారత చూపారు. రూ.4,86,950లు నిధులు పోగుచేసి మంగళవారం బాధితుని కుటుంబానికి అందజేశారు.
అప్రమత్తతే ప్రధానం
సీతంపేట: మలేరియా కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విశాఖ జోనల్ మలేరియా నివారణాధికారి బి.ప్రభావతి అన్నారు. స్థానిక ఏరియా ఆస్పత్రి, దోనుబాయి పీహెచ్‌సీని ఆమె మంగళవారం సందర్శించారు. రోగులతో మాట్లాడారు. మలేరియా కేసుల నమోదు, వైద్యసేవల తీరును ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావును అడిగితెలుసుకున్నారు. ల్యాబ్‌లు తనిఖీ చేశారు. మందులన్నీ అందుబాటులో ఉన్నాయని, రోగులకు సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. దోనుబాయి గ్రామంలో ఎల్‌ఎల్‌ఐఎన్ దోమతెరలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈఓ తిరుపతి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ విజయపార్వతి, దోనుబాయి వైద్యాధికారి శివశంకర్, మలేరియా సబ్‌యూనిట్ ఆఫీసర్ జె.మోహన్‌రావు, కన్సల్టెంట్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో నిర్వహించే శాప్ అథ్లెటిక్స్ లీగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఈ నెల 21న నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి నగర శివారులోని విజ్జీ స్టేడియంలో అండర్–16, 20 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక పోటీల్లో పాల్గొనబోయే క్రీడాకారులు క్రీడా యాప్‌లో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. క్రీడాకారులకు భోజన సదుపాయం కల్పిస్తామన్నారు.


