సాలూరు రూరల్:గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు నిత్యకృత్యంగా మారాయి. సాలూరు మండలం కొదమ పంచాయతీ బందపాయి గ్రామానికి చెందిన చోడిపల్లి టీటమ్మ సోమవారం సాయంత్రం కడుపునొప్పితో బాధపడుతుంటే.. గ్రామస్తులు ఆమెను డోలీలో 2 కిలోమీటర్ల దూరంలోని కొదమవరకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నంద గ్రామం వరకు 8 కిలోమీటర్లు ద్విచక్రవాహనంపైన, అక్కడి నుంచి ఆటోలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమె ఆరోగ్యం కుదుటపడడంతో ఇంటికి తీసుకెళ్లినట్టు ఆమె కుటుంబ సభ్యులు తెలి పారు. తక్షణమే గ్రామానికి రోడ్డు వేసి డోలీ కష్టాలు తీర్చాలని బందపాయి గ్రామస్తులు కోరారు. పల్లె పండగ పేరుతో గ్రామీణ ప్రాంతాల రోడ్లను అద్దంలా చేస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ నీటిమూటగా మారిందంటూ విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా గిరిజనుల రోడ్డు కష్టాలను పట్టించుకోవడంలేదని వాపోయారు.


